నెట్ ఫ్లిక్స్ షో చూసి భరి తెగించిన మోసగాడు

Wed Jan 25 2023 09:38:06 GMT+0530 (India Standard Time)

How Sukesh Chandrasekhar legitimized his wife Leena's income

నల్ల ధనాన్ని వైట్ చేయడమెలా?  సామాన్యుడికి అందని చిక్కు ప్రశ్న ఇది. ఇలాంటివి సినిమాల్లో విలన్లు చేస్తుంటే చూడటమే కానీ నేరుగా ప్రయత్నించే ధైర్యం ఎవరికి ఉంది?  సామాన్య మధ్యతరగతి ప్రజలు అరకొర జీతంతో గౌరవంగా సంఘంలో బతికేయాలనుకుంటారు కానీ తప్పు దారిలో డబ్బు సంపాదించాలని అనుకోరు. కానీ ఈ కేటుగాడు మాత్రం నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు పన్నిన వ్యూహం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇటీవల 200 కోట్ల స్కామ్ లో కాన్ మాన్ సుకేష్ చంద్రశేఖర్ లీలల గురించి ఈడీ తవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు భార్య లీనాతో కలిసి అతడు ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. సుకేష్ చంద్రశేఖర్ తన భార్య లీనా ఆదాయాన్ని ఎలా చట్టబద్ధం చేశారు? అనేది విస్తుగొలుపుతోంది.

EOW వెల్లడించిన వివరాల ప్రకారం.. సుకేష్ చంద్రశేఖర్ - లీనా పౌలోస్ లెక్కలో లేని డబ్బును లాండరింగ్ చేయడానికి చిన్న సంస్థలను ఉపయోగించారు.  ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే.. లీనా పౌలోస్  ఆమె భర్త సుఖేష్ చంద్రశేఖర్ నెట్ ఫ్లిక్స్ షో `ఓజార్క్` నుండి పాఠాలు నేర్చుకున్నారు. ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆ మేరకు ఈ వాస్తవాలను వెల్లడించింది. ఈ జంట పెద్ద మొత్తంలో నగదును కూడబెట్టారు. అందులో ఎక్కువ భాగం లెక్కలో లేని డబ్బు.. ఆపై దానిని చిన్న వాణిజ్య సంస్థల ద్వారా చట్టబద్ధమైన ఆదాయంగా మార్చారు. ఓజార్క్ లోని మనీలాండరింగ్ జంట పద్ధతిలో చంద్రశేఖర్- పౌలోస్ కూడా అక్రమ సంపాదనను చట్టబద్ధం చేయడానికి మార్గాలను వెతికారు. వెబ్ సిరీస్ ని తెలివిగా అనుసరించారు.

నెయిల్ ఆర్టిస్ట్రీ పేరుతో పౌలోస్ సెలూన్ ను నిర్వహించడం ద్వారా బ్లాక్ ని వైట్ చేసారు. అక్కడ లీనా ఆమె సిబ్బంది కస్టమర్ల నుండి సంపాదనను రాబట్టేందుకు యాధృచ్ఛిక కార్డులను స్వైప్ చేశారని పోలీసులు తెలిపారు. అదే పద్ధతిని ఉపయోగించి సూపర్ కార్ ఆర్టిస్ట్రీ ఎల్.ఎస్ ఫిషరీస్ (లీనా - సుకేష్‌ల ఇనిషియల్స్).. న్యూస్ ఎక్స్ ప్రెస్ మొదలైన సంస్థల వద్ద మనీ లాండరింగ్ జరిగిందని చార్జిషీట్ పేర్కొంది. నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచడానికి వాటిని చట్టబద్ధమైన వ్యాపార లావాదేవీలుగా మార్చడానికి ఈ సెలూన్ లు ఇతర సంస్థలను ఉపయోగించారని పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు.

ఛార్జిషీట్ ఇంకా కొనసాగుతోంది. విచారణ సమయంలో M/s నెయిల్ ఆర్టిస్ట్రీ.. M/s సూపర్ కార్ ఆర్టిస్ట్రీ.. M/S LS ఫిషరీస్.. M/s LS ఎడ్యుకేషన్ .. M/s న్యూస్ ఎక్స్ ప్రెస్ పోస్ట్ బ్యాంక్ స్టేట్ మెంట్ లు కూడా పోలీసులు సంపాదించారు.

ఇవన్నీ నిందితురాలు లీనా పౌలోస్ నిర్వహిస్తున్న సంస్థలు.. మనీ లాండరింగ్ కు వీటిని విరివిగా ఉపయోగించారు. జూన్ 2020 నుండి ఆగస్టు 2021 వరకు వివిధ సంస్థలు వ్యక్తుల నుండి పౌలోస్ బ్యాంక్ ఖాతాలకు నిధులు జమ అయ్యాయి. ఈ లావాదేవీలన్నీ బూటకపు లావాదేవీలు అని దర్యాప్తులో తేలింది.

అరుణ్ ముత్తు- బి మోహన్ రాజ్ సహా లీనాకు సంబంధించిన పలువురు సన్నిహిత వ్యక్తులు సుకేష్ అందించిన నగదుకు బదులుగా నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బదిలీ చేసినట్లు కూడా కనుగొన్నారని ఛార్జిషీట్ లో పేర్కొంది. నేరం అంటే..? జూన్ 2020 నుండి ఆగస్టు 2021 వరకు ఈ కేసులో ఫిర్యాదుదారుని క్రైమ్ సిండికేట్  లీనా పౌలోస్ నిర్వహిస్తున్న ఐదు బ్యాంకు ఖాతాలలో రూ. 21 కోట్లు ఆమె పేరు మీద జమ చేసారు.

పోలీసుల దర్యాప్తులో నగదు డిపాజిట్- కార్డ్ స్వైపింగ్ వంటివి అరుణ్ ముత్తు- బి మోహన్ రాజ్ సహా ఇతర అసోసియేట్ ల ద్వారా ఎంట్రీలు జరిగాయి. నిందితురాలు లీనా పౌలోస్ ఇతర సిండికేట్ సభ్యుల పేర్లు ఎంట్రీల్లో ఉన్నాయి. వీరంతా నగదు డిపాజిట్ చేశారు.

ఆమె సెలూన్ నెయిల్ ఆర్టిస్ట్రీ ఆదాయాన్ని పెంచడానికి కార్డ్ స్వైపింగ్ నేరంలో లీనమయ్యారు. ఇదంతా బూటకపు బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా నేర ఆదాయానికి చట్టబద్ధత కల్పించడానికి జరిగింది.. అని పోలీసులు ఆరోపించారు. చార్జిషీట్ ప్రకారం.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పౌలోస్ కు చంద్రశేఖర్ తో జూలై 2014లో వివాహం జరిగింది. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు .. ఇద్దరి కుటుంబం నుండి రూ. 200 కోట్ల దోపిడీకి సంబంధించిన కేసులో ఆమె తన భర్తతో పాటు అరెస్టైంది. సెప్టెంబర్ నుంచి జైల్లోనే ఉన్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.