Begin typing your search above and press return to search.

అప్పట్లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల మధ్య విబేధాలకు అదే కారణమా?

By:  Tupaki Desk   |   19 Aug 2022 5:30 PM GMT
అప్పట్లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల మధ్య విబేధాలకు అదే కారణమా?
X
తెలుగు సినిమా మూకీల నుంచి టాకీలలో పడి, పరుగు అందుకుంటూ ఉండగా, ఎన్టీ రామారావు - ఏఎన్నార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అంతకుముందు ఆ తరువాత కూడా చాలామంది నటీనటులు తెలుగు తెరపై తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

కానీ తెలుగు సినిమా చరిత్రను గురించి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ - ఏఎన్నార్ పేర్లను ప్రధానంగా ప్రస్తావించక తప్పదు. తెలుగు సినిమా కీలకమైన మలుపు తిరగడానికీ వారు కారకులయ్యారు. తమదైన ముద్రను ప్రేక్షకుల హృదయాలలో బలంగా వేయగలిగారు.

నటనలో ఎవరి శైలి వారిది .. ఎవరి ప్రత్యేకత వారిది. ఇద్దరి మధ్య గట్టిపోటి ఉండేది .. అది ఆరోగ్యకరమైనదిగా ఉండేది. అందువల్లనే ఇద్దరూ కలిసి 15 సినిమాలలో నటించారు. ఆ సినిమాలలో ఎవరు గొప్పగా చేశారు అనే చర్చలు ఎప్పుడూ తలెత్తలేదు. ఎందుకంటే ఎవరికి తగిన పాత్రలు వారు పోషించేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి తన సినిమాలో కృష్ణుడి రోల్ చేయావలసిందిగా ఏఎన్నార్ ను ఎన్టీఆర్ అడిగారట. ఆల్రెడీ ఆ తరహా పాత్రలలో ఎన్టీఆర్ ఫేమస్ కనుక, తాను చేయనని అన్నారట ఏఎన్నార్.

ఈ విషయంలోనే ఇద్దరి మధ్య కొంతకాలం మనస్పర్థలు నడిచాయనీ, ఆ సమయంలో వాళ్లిద్దరూ మల్టీస్టారర్ సినిమాలు కూడా చేయలేదనే టాక్ ఉంది. ఆ సమయంలో వాళ్లతో కలిసి పనిచేసేవారు కొంత ఇబ్బందిపడినట్టుగా కూడా చెప్పుకుంటారు.

అలాంటి సమయంలో తాను కూడా ఇద్దరి సినిమాలకి పనిచేశానని ఆ మధ్య సినారె చెప్పారు. సి. నారాయణ రెడ్డిని 'గులేబకావళి కథ' సినిమాతో తెలుగు సినిమాకి ఎన్టీఆర్ పరిచయం చేశారు. అది తన మొదటి సినిమా కనుక అన్ని పాటలను తనతో మాత్రమే రాయించాలనే సినారె షరతుకి ఒప్పుకుని మరీ ఎన్టీఆర్ ఆయనను రంగంలోకి దింపారు.

'గులే బకావళి' సినిమాకి 10 రోజుల్లో 10 పాటలు రాసిన సినారె, ఎన్టీఆర్ ప్రశంసలను అందుకున్నారు. అదే సమయంలో ఏఎన్నార్ హీరోగా రూపొందుతున్న 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఒక పాట రాయాలని దుక్కిపాటి మధుసూదనరావు అడిగితే, ఒకవేళ ఈ సినిమా ముందుగా విడుదలైతే, సింగిల్ కార్డు కోసం తాను పడిన శ్రమకి అర్థం లేకుండా పోతుందని సినారె అన్నారట. ఎన్టీఆర్ - ఏఎన్నార్ మధ్య విభేదాలు నడుస్తున్న సమయంలోను ఇద్దరి సినిమాలకు కలిసి పనిచేయడం సినారె గొప్పతనం. వాళ్లిద్దరినీ మెప్పిస్తూ రావడం తన వ్యక్తిత్వం వలన సాధ్యమైందని ఆయన చెప్పడం విశేషం.