ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ ఆశలన్నీ జక్కన్న పైనే..!

Fri May 13 2022 09:22:44 GMT+0530 (IST)

Hopes of Mahesh fans are on Rajamouli..!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.అయితే హిట్లు వస్తున్నా.. అవన్నీ ఒకటే తరహా సినిమాలు కావడం.. మహేష్ సబ్టిల్ పాత్రలకే పరిమితమవడంపై ఓ వర్గం అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ని సరికొత్త అవతార్ లో చూడాలని కోరుకున్నారు. SVP సినిమా ఆ లోటుని పూరిస్తుందని భావించారు.

'గీత గోవిందం' ఫేమ్ పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ''సర్కారు వారి పాట''. భారీ అంచనాల నడుమ గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా మహేశ్ గత చిత్రాల మాదిరిగానే సందేశంతో కూడిన కమర్షియల్ సినిమా.

మహేశ్ సరికొత్త లుక్ లో కనిపించినప్పటికీ.. అదే రకమైన రొటీన్ కమర్షియల్ స్క్రిప్స్ ఎంచుకోవడం.. ఒకే రకమైన మేనరిజమ్స్ - డైలాగులు చెప్పడం పట్ల కొందరు ఫ్యాన్స్ సంతోషంగా లేరు. ఓ వర్గం ప్రేక్షకులు సైతం మహేష్ నుంచి ఒకటే తరహా సినిమాలు చూసి బోర్ గా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

ఎందుకంటే ఇటీవల స్టార్ హీరోలందరూ కంప్లీట్ మేకోవర్ అవుతూ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ రా అండ్ రస్టిక్ లుక్ లో ఆకట్టుకున్నాడు. RRR సినిమా కోసం ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా మేకోవర్ అయ్యారు.

'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ పౌరాణిక పాత్రలో.. 'సలార్' లో ఊర మాస్ క్యారక్టర్ లో కనిపించబోతున్నారు. 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ.. 'దసరా' సినిమా కోసం నాని.. 'ఏజెంట్' సినిమాతో అఖిల్.. ఇలా ప్రతి ఒక్క హీరో తమని తాము మార్చుకుంటూ వస్తున్నారు.

మహేశ్ బాబు కూడా కాస్త గ్యాప్ తీసుకొని అయినా.. కంప్లీట్ మేక్ ఓవర్ చెయ్యాలిసిన టైమ్ వచ్చిందని సినీ అభిమానులు భావిస్తున్నారు. అయితే అది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాత్రమే చేయగలడని నమ్ముతున్నారు.

మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. కాకపోతే త్రివిక్రమ్ సినిమాల్లో పూర్తి భిన్నమైన పాత్రలో హీరోని ఎక్సపెక్ట్ చేయలేం.

ఈ నేపథ్యంలో దీని తర్వాత జక్కన్న దర్శకత్వంలో చేయబోయే సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి అయితేనే మహేశ్ ను కచ్చితంగా సరికొత్తగా ఆవిష్కరిస్తారని వారు భావిస్తున్నారు.

ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సో హీరోని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ఆస్కారం వుంటుంది. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అందులోనూ జక్కన్న సినిమా అంటే.. సమయం ఎక్కువ తీసుకున్నా బ్లాక్ బస్టర్ మాత్రం గ్యారంటీ. అంతేకాదు అది కచ్చితంగా పాన్ ఇండియా అని ఫిక్స్ అవ్వొచ్చు. అగ్ర దర్శకుడితో వర్క్ చేసిన హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతున్నారు. మరి రాజమౌళి చిత్రంతో మహేశ్ బాబు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.