Begin typing your search above and press return to search.

అఖిల్ స్పై థ్రిల్ల‌ర్ కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌

By:  Tupaki Desk   |   20 Sep 2020 11:10 AM GMT
అఖిల్ స్పై థ్రిల్ల‌ర్ కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌
X
టాలీవుడ్ ‌లో భారీ సినిమా అంటే దానికి ఎంతో కొంత హాలీవుడ్ ట‌చ్ వుండేలా ద‌ర్శ‌కులు ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత‌లు కూడా పెట్టుబ‌డుల‌కు వెనుక‌డ‌టం లేదు. ఎంత ఖ‌ర్చ‌యినా స‌రే హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ వుండాల్సిందే అంటున్నారు. రాజ‌మౌళి ఈగ- బాహుబ‌లి వంటి చిత్రాల‌కు హాలీవుడ్ కు చెందిన వీఎఫ్ ఎక్స్ కంపెనీల‌ని రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల `సైరా` మేక‌ర్స్ కూడా ఈ మూవీలోని భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్స్ ని తీసుకొచ్చారు. అదే త‌ర‌హాలో `సాహో` మూవీ స్ట‌న్నింగ్ వీఎఫ్ ఎక్స్ కోసం హాలీవుడ్ సూప‌ర్ వైజ‌ర్స్ ని దించేశారు.

`సైరా` కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్ ‌ల‌తో వ‌ర్క్ చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ ‌రెడ్డి త‌న తాజా చిత్రానికి కూడా హాలీవుడ్ టెక్నీషియ‌న్ ‌ల‌ని పెట్టుకుంటున్నాడ‌ట‌. అఖిల్ అక్కినేనితో సురేంద‌ర్ రెడ్డి ఓ భారీ స్టైలిష్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ ని రంగంలోకి దింపాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. స్టైలిష్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ కావ‌డంతో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇంట‌ర్నేష‌న్ స్టాండ‌ర్డ్స్ లో వుండాల‌ని అందు కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్స్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌.

చాలా కాలంగా యాక్ష‌న్ ఇమేజ్ కోసం అఖిల్ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అఖిల్- హ‌లో చిత్రాల్లో యాక్ష‌న్ కొత్త‌గా వుండేలా ప్లాన్ చేసినా ఆ సినిమాలేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ఈ మూవీతో అయినా ఆ కోరిక‌ని తీర్చుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. స్టోరీ డిమాండ్ మేర‌కు ఈ చిత్రాన‌కి 100 కోట్ల బ‌డ్జెట్ అయ్యే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. అయితే అఖిల్ ‌ని పెట్టి 100 కోట్లు అంటే క‌ష్టం కాబ‌ట్టి 50 కోట్ల‌ల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని సురేంద‌ర్ ‌రెడ్డి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.