'స్పై' హై ఇంటెన్స్ యాక్షన్ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్..!

Sat May 21 2022 10:56:50 GMT+0530 (IST)

Hollywood Technicians For 'Spy' High Intense Action..!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్పై''. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ED ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి 'స్పై' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నిఖిల్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ ఈ యాక్షన్ సీన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాలను వెళ్లడిస్తూ మేకర్స్ సెట్స్ లోని ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'మేరీ కోమ్' 'శకుంతలా దేవి' 'తాన్హాజీ' వంటి హిందీ చిత్రాలలో భాగమైన ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా తో కలిసి హాలీవుడ్ డిఓపి జూలియన్ అమరు ఎస్ట్రాడా ఈ యాక్షన్ బ్లాక్స్ ను షూట్ చేస్తున్నారు.

నిఖిల్ తో పాటుగా బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే - అభినవ్ గోమతం - హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ మరియు సన్యా ఠాకూర్ లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. జిషు సేన్ గుప్తా - నితిన్ మెహతా - రవివర్మలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల విడుదలైన 'స్పై' కిక్కాస్ టైటిల్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. నిఖిల్ పూర్తిగా భిన్నమైన అవతార్ లో.. తొలిసారిగా గూఢచారి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇది యువ హీరో కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని అనిపిస్తుంది.

ఫుల్ యాక్షన్ తో కూడిన స్పై థ్రిల్లర్ గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించడం విశేషం. దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ విభాగాన్ని కూడా చూసుకుంటున్నారు.

శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అనిరుధ్ కృష్ణమూర్తి మాటలు రాస్తున్నారు. అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ను నిర్వహిస్తుండగా.. రవి ఆంటోనీ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

''స్పై'' చిత్రాన్ని తెలుగు హిందీ తమిళం కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.