రాజమౌళికి హీరోయిన్ షాక్.. సరిదిద్దే ప్రయత్నం.. అప్పటికే నష్టం జరిగిపాయె..!

Sat Jan 23 2021 12:45:06 GMT+0530 (IST)

Hollywood Heroine Gave Shock To Rajamouli

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో RRR ముందు వరసలో ఉంటుంది. జక్కన్న స్టాంప్ వాల్యూ అలాంటిది మరి! రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చారిత్రక సినిమాపై ఆడియన్స్ లో ఎన్నో అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన టీజర్లకు వచ్చిన విశేష స్పందనే ఆ విషయం తెలియజేసింది. దీంతో.. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో జక్కన్నకు షాకిచ్చింది హీరోయిన్.మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు కొమరం భీం జీవితాలను స్పృశిస్తూ.. కాస్త కల్పితాన్ని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో చరణ్ అల్లూరి గా.. తారక్ భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ సినిమాను.. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు గడిచింది. అయితే.. కొవిడ్ ఇతరత్రా సమస్యల కారణంగా షూటింగ్ జాప్యమవుతూ వస్తోంది. ఇంకా.. ఈ సినిమాలో ప్రధాన ఘట్టాలను షూట్ చేయనేలేదు. లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోవడం.. ఆ తర్వాత రాజమౌళి ఫ్యామిలీతోపాటు లేటెస్ట్ గా రామ్ చరణ్ వరకు కరోనా బారిన పడడం వంటి కారణాలు చాలా ఉన్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల కారణంగా.. ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేస్తామని షూటింగ్ ఆరంభంలోనే ప్రకటించింది యూనిట్. కానీ.. చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో మరోతేదీని ప్రకటించింది. 2021 జనవరి 8న రిలీజ్ అవుతుందని జక్కన్న వెల్లడించాడు. కానీ.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో..  సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో దర్శకుడికి భారీ షాకిచ్చింది లేడీ స్కాట్. ఈ సినిమాలో లేడీ స్కాట్‌గా చేస్తున్నారు హాలీవుడ్ నటి అలీసన్ డూడీ. ఆమె లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో RRR గురించి ఓ పోస్ట్ చేసింది. అయితే.. అది మామూలు విషయం కాదు. ఆ సినిమా రిలీజ్ డేట్ గురించింది. యూనిట్ అధికారికంగా ప్రకటించక ముందే.. అక్టోబర్ 8న RRR విడుదల కాబోతోందని రాసుకొచ్చింది అలీసన్.

అయితే.. చేసిన పొరపాటు ఏంటో గుర్తించిన అలీసన్ డూడీ వెంటనే తన పోస్ట్ డెలీట్ చేసింది. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనోళ్లు కంప్యూటర్ కన్నా స్పీడు కదా.. ఆమె పోస్టు డెలీట్ చేసే లోపే .. స్క్రీన్ షాట్స్ కొట్టేశారు. సోషల్ మీడియాలో వేసేశారు. ఇప్పుడీ న్యూస్ వైరల్ అవుతోంది. మరి జక్కన్న ఏం చేస్తాడు? అదే రోజున సినిమా రిలీజ్ చేస్తాడా? మరో డేట్ ను ప్రకటిస్తాడా? అన్నది చూడాలి.