'ఆర్‌ఆర్ఆర్' కి హాలీవుడ్ డైరెక్టర్ రివ్యూ

Sun Aug 14 2022 21:07:12 GMT+0530 (IST)

Hollywood Director Edgar Wright On RRR

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పాటు 60 కి పైగా దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అవుతూ టాప్ లో ట్రెండ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎడ్గార్ రైట్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది.తాజాగా ఎడ్గార్ రైట్ ట్విట్టర్ లో... ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూశాను. బీఎఫ్‌ఐ లో పెద్ద ఎత్తున ప్రేక్షకులతో కలిసి సినిమా ను చూశాను. అద్భుతంగా ఉంది సినిమా. చాలా ఎంటర్‌టైనింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ సమయంలోనే చప్పట్లు కొట్టేలా ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమా ను చూడటం ఇదే మొదటిసారి అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఎడ్గార్ రైట్ రివ్యూతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ వసూళ్లను నమోదు చేయగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా ఇప్పటికి కూడా ఏదో ఒక దేశంలో స్ట్రీమింగ్ అవ్వడం లేదా స్క్రీనింగ్ అవ్వవడం జరుగుతూనే ఉంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా విజువల్ వండర్ అన్నట్లుగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో సినిమా కు ప్రశంసలు దక్కుతున్నాయి.