Begin typing your search above and press return to search.

నరేశ్ కు టైం లేదు.. ఆయన్నేం చేద్దాం?

By:  Tupaki Desk   |   11 Sep 2019 10:21 AM GMT
నరేశ్ కు టైం లేదు.. ఆయన్నేం చేద్దాం?
X
ఇటీవల "మా" ఎన్నికలు జరగటం తెలిసిందే. సాధారణ ఎన్నికలకు మించిన ఉత్కంటతో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లోకీలకమైన పోలింగ్ కు ముందు.. ఫలితాల తర్వాత పోటీ పడిన రెండు వర్గాల మధ్య నడిచిన మాటల యుద్ధం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ పై నరేశ్ ప్యానల్ విజయం సాధించటం తెలిసిందే. చూస్తుండగానే నరేశ్ ప్యానల్ గెలిచి ఆర్నెల్లు అయిపోయింది. ఎన్నికల వేళలో ఆర్టిస్ట్ ల సంక్షేమం కోసం ఏదేదో చేస్తానని చెప్పటమే కానీ ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో మా కార్యవర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా సభ్యుల మధ్య ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. అవిప్పుడు బయటకు వచ్చి సంచలనంగా మారాయి.

నిన్న జరిగిన సమావేశంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గడిచిన ఆర్నెల్లుగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవటంపై హాట్ చర్చ సాగింది. అధ్యక్షులుగా ఉన్న నరేశ్ తన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారని.. దీంతో ఆయన మాను పట్టించుకోలేకపోతున్నట్లుగా విమర్శలు వచ్చాయి.

మా చేస్తున్న సహాయ కార్యక్రమాల కోసం ఫండ్ రైజింగ్ చేయకపోగా.. అకౌంట్లో ఉన్న నిధుల్లో నుంచి రూ.20 లక్షల మొత్తాన్ని ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఈ సొమ్ము దేని కోసం ఖర్చు చేశారు? అన్న దానిపై స్పష్టత లేదంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న వారు పనుల్ని పట్టించుకోకపోతే ఎలా అంటూ నిలదీయటం కనిపించింది. నరేశ్ కు అధ్యక్షుడిగా పని చేయటం ఆసక్తి లేకుంటే దిగిపోవాలని.. ఒక్కరి కారణంగా అందరికి చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయాన్ని నటుడు రాజశేఖర్ వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ఈ సమావేశంలో మరో ఆసక్తికర చర్చ కూడా జరిగింది. గెలిపించిన నరేశ్ అసోసియేషన్ పనులు చేయకుండా.. సొంత పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో.. ఆయన్ను ఏం చేద్దామన్న చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. నరేశ్ ను ఏం చేద్దాం? ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగిద్దామా? పదవి నుంచి తొలగిద్దామా? అంటూ ప్రశ్నలు వేయటం కనిపించింది.

అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని నేరుగా తీసేయటం కుదరదు కాబట్టి.. చట్టప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వాలని భావించారు. స్వపక్షమే తన పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రకటించిన వేళ.. నరేశ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.