హీరో కూతురి బర్త్ డే పార్టీ.. నిర్మాతల ఖర్చుతో

Sun Nov 22 2020 16:40:34 GMT+0530 (IST)

Hero daughter birthday party .. at the expense of the producers

టాలీవుడ్లో స్టార్ హీరోల ఆధిపత్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు అత్యంత కీలకమైన వ్యక్తి దర్శకుడే అతడి పనితనం మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది కానీ.. ఈ లాజిక్ కంటే హీరోల మ్యాజిక్ మీదే నిర్మాతలకు గురి. ఒక కథ తయారయ్యాక ఆ కథకు తగ్గ హీరోతో సినిమా తీయడం అన్నది పాత పద్ధతి. ముందు హీరో డేట్లు సంపాదించడం.. దాన్ని పట్టుకుని దర్శకుల వైపు చూడటం.. ఆ తర్వాత స్క్రిప్టు తయారు చేసుకోవడం.. సినిమా ప్లాన్ చేసుకోవడం ఇదీ వరస. ఒక స్టార్ హీరో డేట్లు సంపాదించడం ఇప్పుడు అత్యంత కష్టమైన విషయం. ఈ కమిట్మెంట్ కోసమే నిర్మాతలు హీరోలకు ఎంత పడితే అంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తుంటారు. లాభాలు వాటాలు ఇవ్వడానికీ రెడీ అయిపోతారు. పారితోషకాలకు తోడు.. కాల్ షీట్లకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించే సంప్రదాయం కూడా నడుస్తోంది టాలీవుడ్లో. దీన్ని వాటాగా మార్చుకునే హీరోలకూ కొదవలేదు.ఇంత చేసినా హీరో సంతృప్తి చెందుతాడన్న గ్యారెంటీ ఏమీ లేదు. నిరంతరం హీరో గారిని ఇంప్రెస్ చేసేందుకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇందులో భాగంగానే తాజాగా ఒక స్టార్ హీరో కూతురి పుట్టిన రోజును భారీ లెవెల్లో నిర్వహించింది ఒక అగ్ర నిర్మాణ సంస్థ. ఆ హీరోతో ఈ ప్రొడక్షన్ హౌజ్ చేపట్టిన భారీ ప్రాజెక్టు ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇంతలో హీరో పుట్టిన రోజు వచ్చింది. హీరో బ్రేక్ తీసుకున్నాడు. ఐతే ఈ సందర్భంలో హీరోను ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించి చాలా పెద్ద పార్టీనే ఏర్పాటు చేసింది ప్రొడక్షన్ హౌజ్. హీరోల పుట్టిన రోజులు కూడా జరపని స్థాయిలోె ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈవెంట్ తాలూకు ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ హీరోగారి బ్రాండ్ ప్రమోషన్ మామూలుగా లేదు. మన పిల్లల పట్ల శ్రద్ధ చూపించే వాళ్ల మీద ఎవరికైనా ప్రత్యేక అభిమానం ఏర్పడుతుంది. సదరు హీరోకు కూడా ఆ నిర్మాతలపై గురి కుదిరి ఇంకో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చినా ఇస్తాడేమో చూడాలి.