Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌పై నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   28 July 2021 4:52 AM GMT
థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌పై నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మాల్స్ ప‌బ్బుల‌కు వెళ్లి మాస్కులు తీసి ఎంజాయ్ చేసేవాళ్ల కంటే థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసేవాళ్లే సుర‌క్షితం! అంటూ నేచుర‌ల్ స్టార్ నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సత్యదేవ్ - ప్రియాంకా జవాల్కర్ జంట‌గా శ‌రణ్ కొప్పిశెట్టి తెర‌కెక్కించిన‌ `తిమ్మరుసు` ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో నాని పైవిధంగా కామెంట్ చేశారు. ఈ వేడుక‌లో నాని ఇంకా ఏమ‌న్నారంటే.. ?

చాలా మంది ప‌బ్లులు క్ల‌బ్బులు మాల్స్ కి వెళ్లి అక్క‌డ మాస్కులు తీసేసి గొప్ప‌గా మాట్లాడుతున్నారు. దానికంటే థియేట‌ర్ల‌లో కూచున్న ఆడియెన్ చాలా సుర‌క్షితం. అక్క‌డా మాస్క్ రూల్ ని పాటిస్తున్నారు. పైగా ఒకేవైపు అంటే తెర‌వైపు మాత్ర‌మే చూస్తారు. ప‌క్క‌వాళ్ల‌తో మాట్లాడ‌రు. కానీ థియేట‌ర్లు అంటు చిన్న చూపు. క‌రోనా వ‌స్తోంద‌ని.. అన్నిటి కంటే ముందు మూసేసేది థియేట‌ర్లు... చివ‌రిలో తెరిచేది కూడా థియేట‌ర్లే. ఈ చిన్న చూపు ఎందుకు? అన్నిటితో పాటే వీటిని తెర‌వొచ్చు క‌దా! అని ప్ర‌శ్నించారు.

పరిస్థితి ఇలానే ఉంటే థియేట‌ర్ల వ్య‌వ‌స్థ నాశ‌నం అవుతుంది. ల‌క్ష‌లాది కార్మికులు రోడ్డున ప‌డ‌తారు. ఉపాధి పోయింది. ఎగ్జిబిష‌న్ రంగం కుప్ప కూలుతుంద‌ని నాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న తిమ్మరుసు థియేట‌ర్ల‌కు ఆక్సిజన్‌ ఇవ్వాలని కోరుకుంటున్నానని నాని అన్నారు. సినిమా అనేది మనకు ఎంతో వినోదం ఇస్తుంది. వినోదం ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ప్రజలు ఆనందంగా ఉంటారు. థియేటర్లో సినిమా చూడటం అనేది మన సంస్కృతిలో భాగం. ఇంట్లో ఆ త‌ర్వాత థియేట‌ర్ల‌లోనే ఎక్కువ‌గా గ‌డిపాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని ఆస్వాదిద్దాం. థ‌ర్డ్ వేవ్ లాంటివి రాకుండా.. అన్ని సినిమాలను థియేటర్ లలో అందరం కలిసి ఆస్వాదించాలని కోరుకుంటున్నా అని నాని అన్నారు.

మొదటినుంచి సత్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడో ప్ర‌యాణం మొద‌లు పెట్టి హీరోగా ఎదుగుతున్నాడు. స‌త్య‌ ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. తిమ్మరుసుతో ఒక స్టార్ గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు... ఈ సినిమా విజ‌యం సాధించాలి.

ట్రైల‌ర్ దూసుకెళుతోంది..

ఇటీవల విడుదలైన టీజ‌ర్లు పాట‌ల‌కు మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ విడుద‌ల చేసిన తిమ్మ‌రుసు ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మజీ- అజయ్‌- ప్రవీణ్ - ఆదర్శ్‌ బాలకృష్ణ- ఝాన్సీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.

నాని వ్యాఖ్య‌ల‌కు స్పందిస్తారా?

థియేట‌ర్ల వ్య‌వ‌స్థ ఇలానే ఉంటే నాశ‌న‌మ‌వుతుంద‌ని నాని చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌భుత్వాలు సీరియ‌స్ గా వినే ప్ర‌య‌త్నం చేస్తాయా?  ఇటు తెలంగాణ‌లో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ చొర‌వ‌తో కొంత‌వర‌కూ వెసులుబాటు క‌ల్పించారు. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుస్తున్నారు. సింగిల్ థియేట‌ర్ల‌కు పార్కింగ్ ఫీజు వెసులుబాటు క‌ల్పించారు. మ‌రిన్ని సౌక‌ర్యాలు అమ‌ల్లోకి వ‌స్తాయి.

కానీ ఏపీలో మాత్రం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై ఇన్నాళ్లు స్పందించ‌క‌పోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అక్క‌డ స‌వ‌రించిన టిక్కెట్టు రేట్ల‌తో సినిమాలు ఆడ‌డం అంత సులువేమీ కాద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాత టిక్కెట్టు ధ‌ర‌ల‌నే ఏపీలోనూ కొన‌సాగిస్తే థియేట‌ర్లు మ‌నుగ‌డ సాగిస్తాయ‌ని చెబుతున్నారు. మ‌రి హీరో నాని ఆవేద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా?  ఎగ్జిబిట‌ర్ల మీటింగులు సినీపెద్ద‌ల స‌మావేశాలు అన్నీ అయిపోయాయి. మునుముందు మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసేందుకు సినీపెద్ద‌లు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయా లేదా? అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్ గానే మారింది.