ఫస్ట్ సినిమా ఇంకా విడుదలే కాలేదు.. అప్పుడే హ్యాట్రిక్ మూవీనా..?

Fri Jul 01 2022 11:00:07 GMT+0530 (IST)

Hatrick Combo VD Puri Jagannadh

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఆ తర్వాత మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. సహజంగా జెట్ స్పీడ్ తో సినిమాలను పూర్తి చేసే డాషింగ్ కు డైరెక్టర్ కు ఈసారి కరోనా బ్రేక్స్ వేయడంతో.. ఈ మూడేళ్లు ఒకే చిత్రానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది.యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ ''లైగర్'' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'లైగర్' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2022 ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ కు ఇంకా టైం ఉండటంతో ఈ గ్యాప్ లో మరో మూవీని సెట్స్ మీదకు తీసుకురావాలని పూరీ డిసైడ్ అయ్యారు.

అప్పుడెప్పుడో రాసుకున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' ను విజయ్ దేవరకొండతోనే చేయాలని భావించారు పూరీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ చూడకుండానే 'JGM' సినిమా చేయడానికి రెడీ అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు వీడీ. తన డైరెక్టర్ మీద నమ్మకంతో వెంటనే మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం 'జేజీఎం' సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా పూరీ - విజయ్ కాంబోలో బ్యాక్ టూ బ్యాక్ రెండు పాన్ ఇండియా చిత్రాలు వస్తుండగా.. ఈ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

'లైగర్' 'జేజీఎమ్' సినిమాల తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో VD మరో మూవీ చేయడానికి ఓకే చెప్పారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే డైరెక్టర్ తో ఇలా వరుసగా మూడు ప్రాజెక్ట్స్ చేయడం ఎందుకని రౌడీ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇప్పుడు ఎందరో క్రేజీ డైరెక్టర్లు విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయడానికి రెడీగా ఉండగా.. పూరీతోనే లాక్ అయిపోవడం పై ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూరీ ఫ్యాన్స్ సైతం టైర్-1 హీరోతో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కోరుకుంటున్నారు.

అయితే ‘లైగర్’ ప్రమోషన్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారేమో అనే సందేహాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే వీడీ-పూరీ కాంబోలో హ్యాట్రిక్ మూవీకి కమిట్ అయ్యారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.