టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరో ఫిక్స్ అవ్వలేదా?

Sun Nov 28 2021 15:00:01 GMT+0530 (IST)

Has anyone fixed the big direction of Tollywood

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీని ఆదుకునే సాయం చేసే పెద్ద దిక్కు ఎవరు? అన్న దానిపై కొన్ని నెలలుగా చర్చ సాగుతూనే ఉంది. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఆ స్థానాని మెగాస్టార్ చిరంజీవి భర్తి చేస్తున్నారని ఇప్పటికే మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. కష్ట కాలంలో మెగాస్టార్ ఆపాత్రదానాలు కానీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ తానున్నానని నిరూపిస్తూ ఇప్పటికే చిరు చాలా చేశారు. అయినా పెద్దన్న పాత్ర  అన్నయ్య చిరంజీవి పోషించడం ఏమిటీ..! అంటూ  మెగా బ్రదర్ నాగబాబు లాంటి వాళ్లు అనేసినా ఇండస్ట్రీ ప్రజలు అలా భావించడం లేదు.ఎందుకంటే దాసరి తర్వాత చిరంజీవి చిన్నసినిమాల ప్రమోషన్ కోసం ఎంతగా సహకరిస్తున్నారో తెలిసిందే. నేరుగా ఆయన ఇంటికి పిలింపించుకుని ట్రైలర్ లు.. పోస్టర్లు లాంచ్ చేస్తూ కోట్లాది రూపాయల విలువ చేసే ఉచిత పబ్లిసిటీని కల్పిస్తున్నారు. గతంలో దాసరి నారాయణరావు నేరుగా వేడుకలకు వచ్చి ప్రమోట్ చేసేవారు. ఇప్పుడు చిరంజీవి వేడుకలకు వెళుతున్నారు. అలానే కుదరని పక్షంలో ఇంటికి పిలిపించుకుని మరీ అవసరం మేర ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. చిరు బిజీ షెడ్యూల్స్ లోనూ ఇలా చేయగలుగుతున్నారు.

ఇక  కోవిడ్ సమయంలో సినీ  కార్మికుల్ని ఆదుకోవడానికి మెగాస్టార్ తీసుకున్న చొరవ గురించి చెప్పాల్సిన పనిలేదు. పూట గడవని కార్మికులకు నిత్యావసరాలు అందించి ఎంతో చేయూతనిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇంకా పరిశ్రమ తరుపున మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఆపదలో ఉన్న కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉన్నారు.

ఇటీవలే ఏపీలో టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత వారిపైనా ఉందని గుర్తు చేసారు. థియేటర్ వ్యవస్థను నిలుపుకోవాలని.. సినిమా వాళ్లని .. కార్మికుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవాలని కోరారు.  ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి ఇప్పటివరకూ  పరిశ్రమకి చాలా సేవలే చేసారు. అయితే `మా` ఎన్నికలు అనంతరం పరిశ్రమ పెద్దగా మోహన్ బాబు ఉండాలంటూ వి. కె నరేష్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం.

పనిచేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుందని మెగాస్టార్ చిరంజీవి నమ్ముతారు. పరిశ్రమలో సినిమాలు నిర్మించి ఎందరికో ఉపాధినిచ్చిన ఘనత ఎంబీ కుటుంబానికి ఉంది. క్రమశిక్షణకు ఇరువురు పెద్దలు మారు పేరు. వారు కొన్ని ప్రజాసేవలు చేశారు. ఇరువురు సమానులేనా కాదా? అన్నది వారి వారి సేవల్ని బట్టి  పరిశ్రమ ప్రజలే నిర్ణయించాల్సి ఉంటుంది. పెద్ద ఫలానా అని ఎవరూ అధికారికంగా ప్రకటించుకోరు. పెద్ద ఎవరు అన్నది చేసే పనులు..సేవలు..స్థాయిని బట్టే పరిశ్రమ పెద్ద పీట వేస్తుందన్నది అందరూ అనుకునే మాట. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.