వెండితెరపై ఓ ట్రెండ్ .. ఓ బ్రాండ్ .. విజయ్ దేవరకొండ!

Sun May 09 2021 11:25:05 GMT+0530 (IST)

Happy Birthday Vijay Devara Konda From Tupaki Team

బలమైన నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడమే కష్టం. తెరపై హీరోగా కనిపించడం ఒక ఎత్తయితే సక్సెస్ ను సొంతం చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండూ అనుకూలిస్తే ఆ క్రేజ్ ను నిబెట్టుకోవడం మరో ఎత్తు. అందుకే ఇక్కడ కొన్ని రోజుల పాటు ప్రయత్నాలు చేసేసి టీ స్టాల్స్ దగ్గర కబుర్లు వినేసి నిరాశతో వెనక్కి వెళ్లిపోయేవారే ఎక్కువ. అయితే టాలెంట్ ఉంటే అభిమానులు థియేటర్ల దగ్గర తమ కటౌట్ లను నిలబెడతారు .. తమ బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా కేజీల కొద్దీ క్రేజ్ ను తెచ్చిపెడతారని నిరూపించిన హీరోల్లో చిరంజీవి .. రవితేజ .. శ్రీకాంత్ .. నాని కనిపిస్తారు.నాని తరువాత స్థానంలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ చేసిన సినిమాలను వ్రేళ్లపై లెక్కబెట్టవచ్చు .. వాటిలో హిట్లు అరడజను లోపే. అయినా ఒక పాతిక సినిమాలు చేసిన హీరోకి ఉండవలసిన క్రేజ్ ఆయన సొంతం. విజయ్ దేవరకొండ కెమెరా వెనక ఎలా ఉంటాడో .. కెమెరా ముందు కూడా అలాగే ఉంటాడు. పాత్ర ఏదైనా ఆయన చూపించే ఆ సహజత్వమే యూత్ కి బాగా నచ్చేసింది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఈ తరం కుర్రకారుకు విపరీతంగా నచ్చేసింది. దాంతో ఇక ఈ కుర్రాడు స్టార్స్ కేటగిరిలో ఉండవలసినవాడని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడబలుక్కుని  ఆ జాబితాలో చేర్చేశారు.

అలా ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు కూడా స్టార్ కాగలడని విజయ్ దేవరకొండ ఈ జనరేషన్ కి స్పష్టం చేశాడు. ఇక తన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ కళ్లలో అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది .. ఆయన మాటల్లో అదే జోష్ వినిపిస్తుంది. జీవితమంటేనే ఒక సాహసం .. విజయాలు సాధించాలంటే ప్రయోగాలు చేయవలసిందే అనే ధోరణిలోనే ఆయన ముందుకు వెళుతుంటాడు. ఆ దూకుడు కారణంగానే చాలా తక్కువ సమయంలోనే ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. 'లైగర్' పేరుతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన లుక్ ను .. స్టైల్ ను మారుస్తూ వెళుతున్నాడు. యాక్షన్ తో .. రొమాన్స్ తో  మాస్ ను .. యూత్ ను ఆకట్టుకుంటున్నాడు. కామెడీతో .. ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ఇక డాన్స్ విషయంలోను వంక బెట్టవలసిన పనిలేదు. ఈ తరం హీరోలకు విజయ్ దేవరకొండ గట్టి పోటీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు తెరపై ఆయన ఒక ట్రెండ్ .. ఒక బ్రాండ్ అంతే.  ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయాల దేవరకొండగా ఎదగాలని కోరుకుందాం!