మణిరత్నం .. ఓ ధ్రువనక్షత్రం (బర్త్ డే స్పెషల్)

Wed Jun 02 2021 11:00:11 GMT+0530 (IST)

Happy Birthday Mani Ratnam From Tupaki Team

ఉదయిస్తున్న సూర్యుడినీ .. పౌర్ణమినాటి చంద్రుడిని ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తారు. ఆ రెండింటినీ చూస్తున్నప్పుడు కలిగే ఆనందానికి హద్దులు లేవు .. ఆ అనుభూతికి కొలమానం లేదు. అలాంటి ఆనందానుభూతులను కలిగించేది మరేదైనా ఉందీ అంటే అది మణిరత్నం సినిమానే. కథాకథనాలు ఏవైనా మణిరత్నం సినిమాలు దృశ్యకావ్యాలుగా కనిపిస్తాయి. అంతటి అద్భుతంగా ఆయన సినిమాల్లోని దృశ్యాలు ఉంటాయి. ఆయనలా ఫ్రేమ్ పెట్టే దర్శకులు వేరొకరు లేరని అభిమానులు అంటూ ఉంటారు.మణిరత్నం తన సినిమా ప్రేక్షకుల మనసు తెరపై పడేలా చూసుకుంటారు. సున్నితమైన భావాలను సైతం బంధించి అందించడం ఆయన ప్రత్యేకత. అందుకోసం ఆయన చేసే కృషి ఒక తపస్సును తలపిస్తుంది. కథ .. కథనం .. మాటలు .. పాటలు .. చిత్రీకరణ .. ఇలా ప్రతి అంశంలోను పరిపూర్ణతను ఆయన ఆశిస్తారు. పాత్రలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరిస్తూ థియేటర్లలోని ప్రేక్షకులు కథలో భాగస్వాములయ్యేలా చేస్తారు. ఇంతటి కసరత్తు ఉంటుంది కనుకనే ఆయన నుంచి సినిమాలు ఆలస్యంగా వస్తుంటాయి. 'గంగిగోవుపాలు గరిటెడైనను చాలు' అనిపిస్తూ ఉంటాయి.

ఇక మణిరత్నం ఎంచుకునే కథలు మిగతా దర్శకులకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఒక కథకు .. మరో కథకు ఎక్కడా ఎలాంటి పోలిక ఉండదు. 'దళపతి' .. 'రోజా' .. 'బొంబాయి' .. 'ఇద్దరు' .. ' ఓకే బంగారం' సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. తెలుగులో నేరుగా ఆయన చేసిన సినిమా 'గీతాంజలి' మాత్రమే. అయితే తమిళంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అనువాదాలుగా పలకరించాయి .. భాషా భేదం లేకుండా ఆదరణ పొందుతూనే వచ్చాయి. పరాజయంపాలైన ఆయన సినిమాలు ప్రయోగాత్మక చిత్రాలుగా మార్కులు సంపాదించుకోవడం విశేషం.

మణిరత్నం సినిమాల్లో యాక్షన్ కంటే ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మాటలకంటే ఫీలింగ్స్ కి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాను ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాగా ఈ కథను మలుస్తున్నారు. కోలీవుడ్ లో ఈ  సినిమా ఒక కొత్త శకానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ రోజున ఆయన జన్మదినం .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.