#RRR: కొమరం భీమ్ వరల్డ్ ఎలా ఉంటుందో?

Wed May 20 2020 10:45:41 GMT+0530 (IST)

Happy Birthday Komaram Bheem Ntr

ఊరించడం విసిగించడం జక్కన్నకు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో! పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ప్రమోషన్ విషయంలో తొలి నుంచి ఇదే పంథాని అనుసరిస్తున్నారు. ఇదిగో మేక అంటే అదిగో పులి అన్న చందంగా ఉంది ఆయన వ్యవహారం. ఫస్ట్ లుక్ లు.. టీజర్లు రిలీజ్ చేస్తున్నాం అని చెబుతూనే వెయిట్ చేయించి విసిగించారు. దాంతో అభిమానులు ఓ రేంజులోనే తిట్టుకున్నారు. సోషల్ మీడియాల్లో అసహనం వెల్లగక్కారు.



అయితే చరణ్ బర్త్ డేకి మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తూ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయడంతో అభిమానులు సంతృప్తి చెందారు. కానీ ప్రస్తుత నిర్భంధ సమయంలో బర్త్ డే జరుపుకుంటున్న తారక్ కి మాత్రం సరైన గిఫ్ట్ ఇవ్వడంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ విఫలమైంది. ఇలా జరిగితే మాస్ ఫ్యాన్స్ శివతాండవమాడేస్తారన్న భయంతో జక్కన్న అండ్ టీమ్ చాలా భయపడ్డారు. అందుకు తగ్గట్టే చాలా ముందునుంచి అభిమానుల్ని ప్రిపేర్ చేశారు. అనుకున్నట్టు టీజర్ ని తేలేకపోతున్నాం అంటూ దువ్వారు. మే 20 బర్త్ డేకి ఒకరోజు ముందే తారక్ తన అభిమానులకు సారీ చెప్పేశాడు. ఆవేశకావేశాలకు లోనయ్యే సన్నివేశం ఇది కాదని టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నామని చెప్పేయడంతో ఫ్యాన్స్ శాంతించారు.

నేడు(మే 20) ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ అధికారికంగా సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఆఫ్ ద స్క్రీన్.. ఆన్ ద స్క్రీన్ తారక్ ఎనర్జీ ఉత్సాహం నింపుతుందని టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. తారక్ .. తో క్రియేట్ చేసిన వరల్డ్ ని చూపించే వరకూ ఆగలేకున్నాం! అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది టీమ్. సరే కానీ.. అసలు కొమరం భీమ్ పాత్ర ఎలా ఉంటుందో.. అతడి వరల్డ్ ఎలా ఉండనుందో ఎప్పటికి చూపిస్తారో ఏమిటో! అంటూ అభిమానులు నిరాశలోనే ఉన్నారు. అయితే ప్రస్తుత నిర్భంధం వీడి పెండింగ్ షూటింగ్ పూర్తయితే కానీ కొమరం భీమ్ విశ్వరూపం చూడలేమనే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బర్త్ డే విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన తారక్ స్మైలీ ఫోటో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.