Begin typing your search above and press return to search.

మనసును ముంచెత్తే మకరందం .. ఇళయరాజా సంగీతం (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   2 Jun 2021 7:30 AM GMT
మనసును ముంచెత్తే మకరందం .. ఇళయరాజా సంగీతం (బర్త్ డే స్పెషల్)
X
ఇళయరాజా .. తెలుగు పాట గురించి తెలిసినవారికి ఆయన పేరు తెలియకుండా ఉండదు. ఆయన పాటలేనిది ఏ కథా పండదు. తెలుగు పాటకు పండగ తెచ్చింది .. .. పరిమళాన్ని అద్దినది ఇళయరాజానే. తెలుగు పాటను తేనెలో ముంచి శ్రోతలకు అందించినవారాయన. మధురమైన పాటలతో మనసు మనసును బంధించినవారాయన. ఆయన బాణీలను ఇష్టపడనివారుండరు .. ఆ బాణీల బాటలో బహుదూరం ప్రయాణించనివారుండరు. ఆయనకి సంగీతం అంటే ప్రేమ .. సంగీతానికి ఆయన అంటే ప్రాణం. అందుకే ఇద్దరూ కమనీయమైన పాటల ప్రవాహమై ముందుకు సాగుతున్నారు. హృదయ సామ్రాజ్యాలను ఏలుతున్నారు.

ఇళయరాజా పాట మాదిరిగా ఆయన జీవితం అందంగా .. ఆహ్లాదంగా సాగలేదు. ఎన్నో కష్టాలు .. మరెన్నో బాధలు ఆయనను వెంటాడుతూనే వచ్చాయి. పేద కుటుంబంలో జన్మించిన ఆయనకి ఆకలి పాడే పాట తెలుసు .. ఆవేదనలో నుంచి పుట్టే ఆలాపన ఎలా ఉంటుందో తెలుసు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయన పల్లె పాటల్లోని భావాల లోతులను అర్థం చేసుకున్నారు. ఆ పదాలలోని సొగసులకు మురిసిపోయారు. తన ఆశయం .. ఆహారం సంగీతమేననే విషయం ఆయనకి అర్థమైపోయింది. ఆ తరువాతనే ఆయన చెన్నై చేరుకోవడం .. సంగీతాన్ని నేర్చుకోవడం జరిగింది.

సంగీత దర్శకుడు జీకే వెంకటేశ్ దగ్గర సహాయకుడిగా కొంతకాలం పనిచేసిన ఇళయరాజా, ఆ తరువాత 1976లో వచ్చిన 'అన్నక్కలి' అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పటివరకూ ఉన్న సంగీత దర్శకులకు పూర్తి భిన్నమైన దారిలో ఆయన తన బాణీలను నడిపించారు .. పాటలను పరిగెత్తించారు. సాహిత్యంలోని భావ సౌందర్యం చెడకుండా పాటను పరిమళింపజేయడం, సంప్రదాయ బద్ధమైన సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని జోడిస్తూ చేసిన ప్రయోగాలు ఆయన ప్రత్యేకతలుగా నిలిచాయి.

ఇళయరాజా సంగీతంలో ఎంతోమంది గాయనీ గాయకులు తమ స్వరాలకు పరీక్షలు పెట్టుకుని ప్రకాశించారు. ఆయన ప్రతిభాపాటవాలకు 'పద్మ భూషణ్' .. 'పద్మవిభూషణ్' కొలమానమై నిలిచాయి. ఆయన స్వరపరిచిన పాటలు .. కరగని పంచదార గుళికలు .. తరగని అనుభూతుల గనులు. ఆ పాటల్లోని గొప్పతనాన్ని చెప్పుకోవడానికి రోజులు సరిపోవు. కడలి తరంగాల వంటి ఆ పాటలను వింటూ ఆనందించడమే .. ఆస్వాదించడమే .. అనుభవించడమే. ఆ సంగీతజ్ఞాని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, ఆయురారోగ్యాలతో .. రాగాల పల్లకిలో ఆయన ప్రయాణం సాగాలని కోరుకుందాం.