అందుకే దర్శకరత్నకు సాటి రారు ఎవరూ!

Tue May 04 2021 11:00:08 GMT+0530 (IST)

Happy Birthday Dasari Narayana Garu From Tupaki Team

పరిశ్రమలో ఎందరు ఉన్నా దాసరి వేరు. ఆయన మహావృక్షం. ఎందరికో నీడనిచ్చిన కల్పతరువు. ఉపాధినిచ్చి అన్నం పెట్టిన మహాత్ముడు ఆయన. ఒక రకంగా జూబ్లీహిల్స్ లోని ఆయన ఇల్లు ఒక నిత్య అన్నదాన సత్రం అని కూడా చెప్పిన వాళ్లు ఉన్నారు. అంతగా ఆయన పరిశ్రమలో శిష్యుల్ని చేరదీశారు. నా అన్నవాళ్లను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించారు. వందలాది మంది ఆర్టిస్టుల్ని టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. దిగ్ధర్శకుడు. దార్శనికుడు. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నిపుణుడు. లంచ్ బ్రేక్ లో స్క్రిప్టు రాయగల సమర్థుడు.దర్శకుడిగా 150 సినిమాల అసాధారణ జర్నీ.. తన సినిమాలకు తానే రచయిత. ఆ 150 సినిమాలతో ఎందరికో ఉపాధినిచ్చిన మహామనిషి. శిష్యులను పెద్ద దర్శకులను చేసేందుకు నిర్మాతగా మారిన గొప్ప వ్యక్తిత్వం. కేవలం ఆయన అందరికీ ఉపాధినిచ్చి వదిలేయలేదు.. వారికి ఏ కష్టం వచ్చినా తనకు చెప్పుకునేంత గొప్ప సహృదయత ఆయనకు మాత్రమే సాధ్యమైంది. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ఉక్కుపాదం మోపేంత గొప్ప దార్శనికుడు ఆయన. పరిశ్రమ 24 శాఖల కార్మికుల్ని ఏకతాటిపై నడిపించిన గ్రేట్ పర్సనాలిటీ. కార్మికులకు నేటి చిత్రపురి కాలనీ అందుబాటులో ఉంది అంటే దానివెనక దాసరి కృషిని ఎవరూ మరువనిది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోని మహామహులు హైదరాబాద్ కి వస్తే ఆయనకు సాష్ఠాంగ నమస్కారం చేసి మరీ వెళ్లేవారంటే ఆయన ఖ్యాతి ఇరుగు పొరుగునా ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. బాలచందర్- భారతీరాజా -కమల్ హాసన్ అంతటి వారు ఆయనకు వీరాభిమానులు.

దాసరి అంటే సూపర్ పవర్. ఆయన పరిసరాల్లో గాంభీర్యం ఎవరినీ మాట్లాడనివ్వదు.. సైలెన్స్ ఉంటుంది. అలాగని ఆయనేమీ సీరియస్ తరహా కాదు. ఎంతో ఫన్నీగా తన వారితో మాట్లాడతారు. ఇలాంటి విలక్షణత చాలా అరుదు. అందుకే ఆయన కాలంతో పాటు వెళ్లినా ఇప్పటికీ ఎప్పటికీ ఎవరూ మరువరు. అన్నట్టు దర్శకరత్న దాసరి నారాయణరావు అంతర్థానం అయ్యాక ఆ లోటు అలానే ఉందనేది పరిశ్రమ వర్గాల్లో చెప్పుకునే మాట. కొందరు కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపగలిగినా ఆయనలా బహుముఖంగా అన్నిటినీ రిజాల్వ్ చేసే సన్నివేశం లేదని విశ్లేషిస్తున్నారు. 4 మే 1947లో పాలకొల్లు(ఆంధ్రప్రదేశ్)లో జన్మించిన ఆయన మద్రాసుకు వెళ్లి దర్శకుడిగా సుదీర్ఘ ప్రస్థానం సాగించారు. మద్రాసు నుంచి హైదరాబాద్ కి సినీపరిశ్రమను తరలించడంలో కీలక వ్యక్తి. అందుకే దర్శకరత్నకు సాటి రారు ఎవరూ.. (నేడు దాసరి జయంతి సందర్భంగా తుపాకి ప్రత్యేకం)