మన షార్ట్ ఫిల్మ్ కు గిన్నిస్ గౌరవం

Mon Jun 27 2022 11:03:23 GMT+0530 (India Standard Time)

Guinness World Records for our short film

యువ దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వంలో కొన్నాళ్ల క్రితం వచ్చిన మనసానమః షార్ట్ ఫిల్మ్ జోరు కంటిన్యూ అవుతూ ఉంది. ఒక సింపుల్ కథ మరియు కథనంతో అమ్మాయి ల్లో ఉండే కన్ఫ్యూజన్ ను దర్శకుడు దీపక్ రెడ్డి చూపించే ప్రయత్నం చేశాడు. అబ్బాయిల కోణంలో ఈ షార్ట్ ఫిల్మ్ కొనసాగుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ మంచి క్వాలిటీ టెక్నికల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ను కూడా కలిగి ఉంటుంది.ఎన్నో దేశీయ మరియు విదేశీయ అవార్డులను దక్కించుకున్న మనసానమః ఇప్పుడు మరో అరుదైన రికార్డును.. అవార్డును దక్కించుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కు ఇప్పటి వరకు మొత్తంగా 513 అవార్డులు వచ్చాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ షార్ట్ ఫిల్మ్ కు కూడా ఇన్ని అవార్డులు వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఒక షార్ట్ ఫిల్మ్ అత్యధిక అవార్డులు దక్కించుకున్న కేటగిరీలో మనసానమః గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది.

తాజాగా దర్శకుడు దీపక్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా మనసానమః షార్ట్ ఫిల్మ్ కు దక్కిన గిన్నిస్ రికార్డును షేర్ చేశాడు. గత సంవత్సరం ఆస్కార్ అవార్డుల రేసులో కూడా నామినేషన్స్ ను దక్కించుకుని అరుదైన ఘనత దక్కించుకుంది. అక్కడ అవార్డును దక్కించుకోలేక పోయినా కూడా నామినేషన్స్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.

అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన దీపక్ రెడ్డి సినిమా నేపథ్యం ఏమీ లేకున్నా కూడా ఇండస్ట్రీ పై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అమెరికాలో ఉన్న సమయంలో ఫిదా సినిమా అమెరికా షెడ్యూల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ గా చేయడంతో ఆయనకు సినిమా మేకింగ్ పై పట్టు దక్కింది.

ఆర్జీవీ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపించే దీపక్ రెడ్డి ఆయన మార్క్ ను తన సినిమాలపై ఉండేలా ప్రయత్నాలు చేస్తాడు అనేది ఒక టాక్. 2019 సంవత్సరంలో మనసానమః షార్ట్ ఫిల్మ్ ను పూర్తి చేసి 2020 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది.  కేవలం అయిదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కు మాత్రం ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు.

ఎంతో మంది ప్రముఖ దర్శకులు కూడా మనసానమః షార్ట్ ఫిల్మ్ ను ప్రశంసించారు. ఇప్పుడు ఏకంగా గిన్నిస్ రికార్డు రావడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ కు అయిదు వందలకు పైగా అవార్డులు రావడం ఏంటీ విడ్డూరంగా ఉందంటూ అంతా కూడా మనసానమః ను మళ్లీ చూస్తున్నారు.