నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఆ ఇద్దరు

Fri Apr 19 2019 20:00:02 GMT+0530 (IST)

Gowtam Tinnanuri And Shiva Nirvana Breaks Negative Sentiment

సాధారణంగా సినిమా పరిశ్రమలో దర్శకులు ద్వితీయ విఘ్నం గురించి బాగా టెన్షన్ పడుతుంటారు. డెబ్యు మూవీ హిట్ అయితే రెండోది పరాజయం పాలు కావడం చాలా సార్లు జరిగింది. అయితే ఈ నెగటివ్ సెంటిమెంట్ కు ఎదురీది బ్రేక్ చేసిన వాళ్ళు లేకపోలేదు. కొరటాల శివ-రాజమౌళి-వినాయక్ ఇలా అతి తక్కువ సంఖ్యలో రెండో సినిమా హిట్ అందుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడీ వరసలో మరో ఇద్దరు అదీ ఒకే నెలలో చేరడం విశేషమేగా.ఒకరు శివ నిర్వాణ. నాని నిన్ను కోరితో పరిచయమైన ఇతను రెండేళ్ళ గ్యాప్ తో చేసిన మజిలి తనకే కాదు నాగ చైతన్యకూ కెరీర్ బెస్ట్ గా నిలవడం వసూళ్ళ పరంగా సమంతాకు మర్చిపోలేని మూవీగా మారడం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. భార్యా భర్తల ఎమోషన్స్ ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోవడంతో ఈజీగా పాస్ అయిపోయింది

ఇక రెండో దర్శకుడు గౌతం తిన్ననూరి. సుమంత్ హీరోగా మళ్ళి రావాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గౌతం దానికి గొప్ప ప్రశంశలు అందుకున్నాడు కాని హీరోకున్న లిమిటెడ్ మార్కెట్ వల్ల కమర్షియల్ గా అద్భుతాలు చేయలేకపోయాడు. కాని రెండో సినిమాకు న్యాచురల్ స్టార్ దొరికాడు. మధ్య వయసు క్రికెటర్ జీవితాన్ని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

ఈ మధ్యకాలంలో కొంచెం కూడా డివైడ్ టాక్ లేకుండా యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చిన మూవీగా జెర్సీనే చెప్పుకోవచ్చు. సో గౌతం కూడా ద్వితీయ గండాన్ని దాటేశాడు. అయినా కంటెంట్ ఉండాలే కాని ఈ సెంటిమెంట్లు సెంట్లు ఏం చేస్తాయని. రెండో సినిమా అయినా వందో సినిమా అయినా సరిగ్గా చెప్పాలే కాని ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది