Begin typing your search above and press return to search.

బ‌న్నీ సినిమాకు కేంద్రం పబ్లిసిటీ

By:  Tupaki Desk   |   20 Jan 2022 9:30 AM GMT
బ‌న్నీ సినిమాకు కేంద్రం పబ్లిసిటీ
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీకి ఉత్త‌రాదిలో మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌లేదు. కేవ‌లం మౌత్ టాక్ తో పాటు హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, స‌రైనోడు చిత్రాలు ఈ మూవీకి ఉత్త‌రాదిలో భారీ క్రేజ్ ని తెచ్చి పెట్టాయి.

దీంతో `పుష్ప‌` ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టించిన ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. ఏకంగా ఉత్త‌రాదిలో 85 కోట్ల మార్కుని దాటి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో `పుష్ప‌` ఫీవ‌ర్ కేవ‌లం ద‌క్షిణాదికే కాద‌ని ఉత్త‌రాదిని కూడా ఊపేస్తోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఇదిలా వుంటే `పుష్ప‌` క్రేజ్ ని కేంద్రం కూడా వాడుకోవ‌డం మొద‌లు పెట్టింది. అంతే కాకుండా `పుష్ప‌`కు పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌చారాన్ని అందించ‌డం మొద‌లుపెట్టింది.

స్వ‌యంగా కేంద్ర ప్ర‌చార మంత్రిత్వ స‌మాచార శాఖ రంగంలోకి దిగ‌డం విశేషం. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌, క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేప‌థ్యంలో `పుష్ప‌` చిత్రంలోని `త‌గ్గేదే లే..` డైలాగ్ ని వాడేసుకుంటూ బ‌న్నీ స్టిల్ ని ప్ర‌మోట్ చేయ‌డం ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బ‌న్నీ పుష్ప‌లో త‌గ్గేదేలే.. అంటూ చెప్పే డైలాగ్ ని, స్టిల్ ని వాడుకుంటూ మాస్క్ త‌గిలించి `మాస్క్ తీసేదేలే`అంటూ అదిరిపోయే మీమ్ ని క్రియేట్ చేసింది.

దీంతో బ‌న్నీ పాన్ ఇండియా లెవెల్లో ఫేమ‌స్ స్టార్ గా మారిపోయారు. దీంతో సినీ వ‌ర్గాలు బ‌న్నీ కోసం స్వ‌యంగా కేంద్ర స‌మాచార శాఖ రంగంలోకి దిగ‌డం ఏంటని, పుష్ప డైలాగ్ ని వాడుకుంటూ ఇండైరెక్ట్ గా `పుష్ప‌` కు ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. గ‌తంలో బ‌న్నీ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి కూడా ఇదే జ‌రిగింది. ఈ మూవీలోని పాట‌ల‌కు క్రికెట‌ర్స్ ఫిదా కావ‌డ‌మే కాకుండా ఆ పాట‌ల‌ని రీక్రియేట్ చేసి సినిమా వైర‌ల్ అయ్యేలా చేశారు.

అంతే కాకుండా ఇప్పుడు పుష్ప వాకింగ్ స్టైల్ అంటూ ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.. దీన్ని కూడా సెల‌బ్రిటీలు భీభ‌త్ప‌వంగా వాడేస్తార‌ని బ‌న్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదిలా వుంటే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా డెల్టా హో .. యా ఒమిక్రాన్ మై మాస్క్ ఉత‌రేగా న‌హీ.. అంటూ కేంద్ర స‌మాచార శాఖ పుష్ప‌ని వాడేసుకుంటే అదే డైలాగ్ ని తెలుగులో తెలంగాణ ప్ర‌భుత్వం ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో వాడేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదంతా గ‌మ‌నించిన వారంతా అదృష్టం అంటే బ‌న్నీదే.. పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా ఓ ప‌క్క క్రికెట‌ర్లు, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం `పుష్ప‌` చిత్రానికి ప్ర‌చారం క‌ల్పిస్తున్నారంటూ వాపోతున్నారు.