Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ అడిగితే ఏదైనా చేసేస్తా...!

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
ప్రభాస్‌ అడిగితే ఏదైనా చేసేస్తా...!
X
గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే వారంలో విడుదల కాబోతున్న పక్కా కమర్షియల్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా గోపీచంద్‌ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తన స్నేహం మరియు ఆయనతో సినిమా ఆఫర్‌ వస్తే చేసే విషయమై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

గోపీచంద్ మరియు ప్రభాస్ లు చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులు ఇద్దరు కలిసి వర్షం సినిమాలో నటించారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఒకరి సినిమా ల ఫంక్షన్ కు మరొకరు హాజరు అవ్వడం చేస్తూ వచ్చారు. ప్రభాస్ తో ఉన్న స్నేహం గురించి గోపీచంద్‌ చాలా తక్కువ సందర్బాల్లో.. చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరి మద్య చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌ షిప్‌ అయితే ఉందనేది అందరికి తెల్సిందే.

ప్రస్తుతం ప్రభాస్ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ కనుక ఆయనతో ఒక పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వస్తే మీరు ఎలాంటి పాత్ర ను కోరుకుంటారు అంటూ యాంకర్ ప్రశ్నించిన సమయంలో ప్రభాస్ అడగాలే కాని పాత్ర ఏదైనా తప్పకుండా చేస్తాను అంటూ గోపీచంద్‌ ప్రకటించాడు. హీరోగా ప్రభాస్ నటించే సినిమాలో గోపీచంద్‌ ఏ సమయంలో అయినా నటించేందుకు సిద్ధం అన్నాడు.

ప్రభాస్‌ తో గతంలోనే విలన్ గా నటించిన గోపీచంద్‌ ఇప్పుడు తాను హీరోగా బిజీగా ఉన్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటున్నాడు. అయినా కూడా ప్రభాస్ అడిగితే విలన్‌ పాత్ర మాత్రమే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అన్నట్లుగా ప్రకటించి ప్రభాస్‌ పై ఉన్న అభిమానంను గోపీచంద్‌ తన మాటల ద్వారా వెళ్లడించాడు.

గోపీచంద్‌ సినిమా పక్కా కమర్షియల్‌ విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్‌ అయ్యింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా లు అంటే కమర్షియల్‌ గా మంచి ఎంటర్‌టైన్మెంట్‌ ను అందిస్తూ ఉంటాయి.

అలాంటి మారుతి మార్క్‌ కమర్షియల్‌ సినిమా కనుక ఖచ్చితంగా పక్కా కమర్షియల్‌ గానే ఉండి.. గోపీచంద్‌ కు సక్సెస్ ను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్‌ మరో రెండు సినిమాలను చేసేందుకు ఇప్పటికే సైన్ చేశాడని సమాచారం అందుతోంది. ఆ సినిమాల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.