ఏడేళ్లకు దక్కిన బ్లాక్ బస్టర్ విజయమిది..!

Mon Sep 13 2021 14:12:23 GMT+0530 (IST)

Gopichand Seetimaar blockbuster success

'యజ్ఞం' 'ఆంధ్రుడు' 'గోలీమార్' 'లక్ష్యం' 'రణం' 'లౌక్యం' వంటి సూపర్ హిట్స్ అందుకున్న టాలీవుడ్ డైనమిక్ హీరో గోపీచంద్.. గత కొంతకాలంగా సాలిడ్ సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నారు. ఏడేళ్ల నిరీక్షణ తర్వాత ''సీటీమార్'' సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. వినాయక చవితి సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ''సీటీమార్'' సినిమా.. ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద మంచి గణాంకాలను నమోదు చేసింది. బి & సి సెంటర్లలో గోపీచంద్ మార్కెట్ ఇంకా చెక్కుచెదరకుండా ఉందని ఈ సినిమా నిరూపించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే జోరును కొనసాగిస్తే రాబోయే వారంలో 'సీటీమార్' బ్రేక్ ఈవెన్ మార్కును ఈజీగా రీచ్ అవడమే కాకుండా.. లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

'సీటీమార్' సినిమా యూఎస్ఏ లో విడుదల కాలేదు. ఈ సినిమా డొమెస్టిక్ రన్ లో సత్తా చాటుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా.. భూమిక చావ్లా - దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

'గౌతమ్ నంద' తర్వాత గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన ''సీటీమార్'' సినిమా వీరిద్దరికీ చాలా ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. 'లౌక్యం' రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కు.. ఈ సినిమా పెద్ద రిలీఫ్. అంతేకాదు రాబోయే చిత్రాలకు ఊపిరి పోసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ల్యాబ్ లో ఉన్న 'ఆరడుగుల బుల్లెట్' చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా గోపీచంద్ - నయనతార హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అలానే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ - రాశీఖన్నా జంటగా నటిస్తున్న 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని కూడా ఈ ఏడాదే విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. UV క్రియేషన్స్ - GA2 పిక్చర్స్ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్ మరియు బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే 'లక్ష్యం' 'లౌక్యం' తర్వాత గోపిచంద్ - డైరెక్టర్ శ్రీవాస్ ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.