మెగా సినిమా మీద ఆశ పోలేదా గోపీ!!

Mon Jul 16 2018 15:02:41 GMT+0530 (IST)

Gopichand Malineni Gives Clarity On About Movie with Sai Dharam Tej

వరస డిజాస్టర్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎవరితో సినిమా చేస్తాడో ఖచ్చితంగా తేలలేదు కానీ ముందైతే తిరుమల కిషోర్ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించేదే ఉంటుంది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే క్లారిటీ ఇంకా రాలేదు. బరువుతో పాటు జుత్తుకు సంబంధించిన మేకోవర్ కోసం కొద్ది  రోజులు బ్రేక్ తీసుకుని తేజు అమెరికా వెళ్తున్నాడన్న వార్తలు గట్టిగానే షికారు చేస్తున్నాయి. ఇక గోపీచంద్ మలినేనితో తేజు గతంలోనే ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన విన్నర్ డిజాస్టర్ అయినప్పటికీ తనకు సరిపోయే మరో మాస్ సబ్జెక్టుతో మెప్పిస్తాడన్న నమ్మకంతో తేజు అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మేరకు అప్పట్లో కొన్ని యాడ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆరు ప్లాపులు వరసగా వచ్చేసరికి రిస్క్ తీసుకునే పొజిషన్ లో తేజు లేడని అందుకే గోపీచంద్ మలినేనికి ఇచ్చిన కమిట్మెంట్ ఆచరణలోకి రాదని కొత్త ప్రచారం ఊపందుకుంది.దీనికి గోపీచంద్ మలినేని స్పందించాడు. ట్విట్టర్ వేదికగా అలాంటిది ఏమి లేదని తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వివరాలు త్వరలోనే చెబుతానని స్పష్టత ఇచ్చాడు. ఈ త్వరలో అనే మాట ఆరు నెలల నుంచి వినపడుతున్నదే. నిజానికి జవాన్ కన్నా ముందే ఇది సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ జరగలేదు. దాని తర్వాత ఒప్పుకున్న తేజ్ ఐ లవ్ యు కూడా వచ్చేసింది. కానీ గోపిచంద్ మలినేనితో చేయబోతున్నట్టు సాయి ధరమ్ తేజ్ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అంతర్గతంగా ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి త్వరలో స్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉండేదేమో ఇప్పటికైతే చెప్పలేం. ఆ విన్నర్ తర్వాత గోపిచంద్ మలినేని కూడా ఏ సినిమా చేయలేదు. అప్పటి నుంచి తేజు స్క్రిప్ట్ మీదే  బిజీగా ఉన్నాడా లేక ఎవరైనా స్టార్ హీరో ఛాన్స్ ఇస్తారేమో అని వెయిట్ చేశాడా అనేది తనకు ఒక్కటే తెలుసు. మొత్తానికి మెగా హీరో సినిమా ఉంటుంది అని నొక్కి చెబుతున్న గోపి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది మరి.