టాలీవుడ్ కు ఈ ఫ్రైడే గుడ్ ఫ్రైడే

Fri Aug 05 2022 15:09:12 GMT+0530 (India Standard Time)

Good Friday For Tollywood

వరుస ఫ్లాపులతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిన టాలీవుడ్ కు ఎన్నాళ్ళ కెన్నాళ్లకు గుడ్ ఫ్రైడే వచ్చేసింది. ఇక మనకు హిట్ లు రావా? ..మనల్ని చూసి అసూయ పడిన బాలీవుడ్ ని మరో సారి అసూయ పడేలా చేయలేమా?..థియేటర్లు ప్రేక్షకుల అరుపులు కేకలు ఈలలతో మారుమ్రోగవా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ దిగ్గజాలకు ఈ ఫ్రైడే కొత్త ఊపిరులూదుతూ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా బ్యాడ్ సెంటిమెంట్ లో సతమతమవుతున్న టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.అప్పటి వరకున్న మాహిష్మతీ సామ్రాజ్యం బాహుబలి ఎంట్రీతో ఊపరి పీల్చుకున్నట్టుగా టాలీవుడ్ ఈ ఫ్రైడే తో మళ్లీ రొమ్ము విరిచి మళ్లీ సత్తా చాటింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ లని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఇక మార్చిలో విడుదలైన 'RRR' పార్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించడమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. అయితే ఆ తరువాత నుంచి భారీ అంచనాలతో గ్రౌండ్ లోకి వీర విహారం చేస్తామంటూ వెళ్లిన బ్యాట్స్ మెన్స్ డక్కౌట్ అవుతూ వరుసగా పెవిలిన్ ముఖం పట్టినట్టుగా ఒక్కో సినిమా ఫ్లాప్ అవుతూ చేతులెత్తేశాయి.

నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో కోట్లల్లో తీవ్ర నష్టాలని తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడానికి ముఖం చాటేయడం మొదలు పెట్టారు. టాలీవుడ్ మునుపెన్నడూ లేని తీవ్ర పరిస్థిలోరి వెళ్లిపోవడంతో ఇక మనం మునుపటి తరహా హిట్ లని చూడలేమా అని ప్రతీ ఒక్కరిలో అనుమానాలు రేకెత్తాయి. అయితే ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఈ శుక్రవారం టాలీవుడ్ కు గుడ్ ఫ్రైడే గా నిలిచి సర్ ప్రైజ్ చేసింది.

ఆగస్టు 5 శుక్రవారం భారీ అంచనాల మధ్య రెండు భిన్నమైన జోనర్ లకు చెందిన సినిమాలు బింబిసార సీతా రామం విడుదలయ్యాయి. అందరి చూపు ఈ రెండు సినిమాలపైనే వుండటంతో ఫలితం ఎలా వుంటుందో.. ప్రేక్షకుల స్పందన ఏంటీ? అనే అనుమానాలు ప్రతీ ఒక్కరిలోనూ మెదిలాయి. అయితే నందమూరి కల్యాణ్ రామ్ నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ మూవీ 'బింబిసార' దుల్కర్ సల్మాన్ నటించిన ఫాంటసీ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గుడ్ న్యూస్ ని చెప్పాయి.

కల్యాణ్ రామ్ నపటించిన 'బింబిసార' 5వ దశాబ్దానికి చెందిన బింబిసారుడి ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కింది. మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సరికొత్త నేపథ్యంలో విజువల్ ట్రీట్ గా మాస్ ని అలరించే అంశాలు వుండటంతో ఈ మూవీకి ప్రేక్షకులు జై కొట్టారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కల్యాణ్ రామ్ కు భారీ విజయాన్ని అందించి మంచి కంటెంట్ వున్న సినిమాలకు ఎప్పుడూ అండగా వుంటామని మరోసారి నిరూపించారు.

ఇక దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ నటించిన 'సీతారామం' పక్కా క్లాస్ బొమ్మ. పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కినా ఇందులో ఎంచుకున్న కథ సినిమాని నడిపించిన తీరు ఫీల్ గుడ్ ప్రేమకథ అబ్బుర పరిచే విజువల్స్ వైజయంతీ మూవీస్ మేకింగ్ వ్యాల్యూస్ సినిమాని ఓ అందమైన విజువల్ ట్రీట్ గా నిలబెట్టాయి. ఫస్ట్ పార్ట్ లో కొంత స్లో నరేషన్ స్పీడ్ బ్రేకర్ గా నిలిచినా కథనంలోకి ప్రేక్షకుడిని ఎంటర్ చేసిన తీరు సినిమాని విజయతీరాలకు చేర్చింది. టాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ బొమ్మ 'బింబిసార' క్లాస్ బొమ్మ 'సీతారామం' ఊహించినట్టుగానే గుడ్ ఫ్రైడేని అందించిన కొత్త ధైర్యాన్ని అందించడం విశేషం.