Begin typing your search above and press return to search.

గొల్లపూడి మారుతీరావు ఇక లేరు

By:  Tupaki Desk   |   12 Dec 2019 8:50 AM GMT
గొల్లపూడి మారుతీరావు ఇక లేరు
X
ప్రముఖ తెలుగు నటుడు.. రచయిత గొల్లపూడి మారుతీరావు చెన్నైలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా ఆరంభమైన ఆయన ప్రస్థానంలో ఎన్నో మేలిమలుపులు ఉన్నాయి. అయన తన సుదీర్ఘమైన కెరీర్ లో దాదాపు 290 చిత్రాలలో నటించారు. ఎన్నో చిత్రాలకు రచయితగా కూడా పని చేశారు. రచయితగా పని చేసిన మొదటి సినిమా 'డాక్టర్ చక్రవర్తి' కి ఆయన నంది అవార్డు అందుకున్నారు.

ఆయన కెరీర్ లో సంసారం ఒక చదరంగం.. 'త్రిశూలం'.. 'ముద్దుల ప్రియుడు'.. 'ఆదిత్య 369' లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. గొల్లపూడి చివరి చిత్రం ఆది సాయికుమార్ నటించిన 'జోడి'. సినీరంగ ప్రవేశానికి ముందు అయన ఆకాశవాణి కడప కేంద్రంలో పని చేశారు. రచయితగా నటుడిగా మాత్రమే కాకుండా గొల్లపూడికి మంచి వక్తగా కూడా పేరుంది. టీవీ రంగంలో కూడా అయన తనదైన ముద్ర వేశారు మనసున మనసై.. ప్రజావేదిక లాంటి ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర వీక్షకులను మెప్పించారు. ఆయన కెరీర్ లో పలు అవార్డులను కూడా అందుకున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి మారుతి రావు మరణం పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అభిమానులు.. సాహితీ ప్రియులు కూడా గొల్లపూడికి నివాళులు అందిస్తున్నారు.