వివాదాస్పద తమిళ వెబ్ సిరీస్ బ్యాన్!

Sun Jun 07 2020 11:53:04 GMT+0530 (IST)

Godman Web Series Banned

ఏదో ఒక వివాదం లేనిదే ప్రచారం రాదు. కంటెంట్ లో ఘాడత లేనిదే వ్యూస్ రావు. ఇక ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల పంథా పరిశీలిస్తే వివాదాల్లేకుండా.. కంటెంట్ లో ఘాటైన రొమాన్స్ .. ఎక్స్ పోజింగ్.. విశృంఖలత లేకుండా లేనేలేవు. ముఖ్యంగా బయోపిక్ కేటగిరీ కాకుండా రొమాంటిక్ క్రైమ్ డ్రామాల్లో ఇలా చెలరేగిపోవడం రివాజుగా మారింది. ఆ తరహాలోనే ఎంచుకున్న కథాంశమే వివాదాస్పదం కాగా.. దానిని తెరకెక్కించిన విధానం తమిళ తంబీల్లో అగ్గి రాజేస్తోంది. తాజాగా ఆ వెబ్ సిరీస్ ని రకరకాల వివాదాల కారణంగా జీ5 వాళ్లే నిలిపివేయడం చర్చనీయాంశమైంది.ఇంతకీ ఏదా వెబ్ సిరీస్ అంటే... గాడ్ మ్యాన్. డబ్బు-అధికారం - దేవుడు- సెక్స్  అనే అంశాల చుట్టూ తిరిగే కథ తో ఈ సిరీస్ ని తెరకెక్కించింది జీ5. సనాతన హిందూ ధర్మాన్ని .. బ్రాహ్మనిజాన్ని కించపరిచే కథాంశంతో వెబ్ సిరీస్ ఆద్యంతం వేడెక్కించేస్తుందిట. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సిరీస్ ఇది. ఇందులో గాడ్ మ్యాన్ గా అందరికీ తెలిసిన నటుడు జయప్రకాష్ నటిస్తే... జులాయిగా వీధి రౌడీలా తిరిగే అయ్యనార్ గా డేనియల్ బాలాజీ నటించాడు. అయ్యనార్ ని గాడ్ మ్యాన్ తన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి వారసుడిగా చేయాలనుకుంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితురాలైన చంద్రలేఖగా సోనియా అగర్వాల్ నటించింది. జులాయి అయ్యనార్ కి ఓ విచిత్రమైన ఆఫర్ ఇస్తుంది చంద్రలేఖ. అనంతరం డబ్బు అధికారం శారీరక మోహాల చుట్టూ తిరిగే అపవిత్ర పోరాటంపై వెబ్ సిరీస్ ఇది. ఇందులో కంటెంట్ పూర్తిగా వివాదాస్పదమైనది.

వాస్తవానికి ఈ సిరీస్ ఇంకా స్ట్రీమింగ్ కి రాలేదు. కేవలం ట్రైలర్ తోనే ప్రకంపనాలు సృష్టించింది. అందులో వివాదాస్పద కంటెంట్ ఉంది అంటూ తమిళనాట రచ్చ మొదలవ్వడంతో జీ5 స్ట్రీమింగ్ చేయకుండా ఆపేసింది. ప్రస్తుతం ఆ సిరీస్ దర్శక నిర్మాతలపై పోలీసు కేసు పెట్టారు. ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈనెల 12న లైవ్ కావాల్సిన సిరీస్ రిలీజ్ తాత్కాలికంగా నిలిపేశారు. హైందవ ధర్మాన్ని కించపరచేందుకు చేసిన ప్రయత్నమే ఇది అంటూ బి.జె.పి. పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు సోషల్ మీడియాలో విమర్శల దాడి చేయడంతో జీ5 పూర్తిగా వెనక్కి తగ్గింది.