దసరా సమరం.. ఆ విషయం ఇంకా సస్పెన్సే!

Fri Sep 30 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

GodFather And The Ghost Team Ticket Price

దసరా సీజన్ వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే స్థాయిలో పోటీకి దిగుతున్నాయి. అయితే అంతా ఓకే కానీ ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ కనసాగుతోంది.వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మలయాళ హిట్ మూవీ 'లూసీఫర్' ఆధారంగా భారీ స్థాయిలో రీమేక్ చేశారు. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 5న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ ని క్రియేట్ చేస్తోంది. 'ఇన్నాళ్లూ రోడ్డ కాంట్రాక్టులు ఇసక కాంట్రాక్టులు నేల కాంట్రాక్టులు నీళ్ల కాంట్రాక్టులు.. మంద కాంట్రాక్టులు అంటూ ప్రజల డబ్బు తిని బలిసి అడ్డంగా కొట్టుకుంటున్నారు.

ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు తీసుకుంటున్నా..' అంటూ మెగాస్టార్ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ అవుతున్న ఆక్టోబర్ 5నే కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్' కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.    

రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి బజ్ క్రియేట్ అయింది. పండగ సీజన్ కాబట్టి ఈ రెండు సినిమాలు భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పండగ సీజన్ లో రెండు భారీ సినిమాలు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓ విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే వుంది. 'RRR' నుంచి పెద్ద సినిమాల టికెట్ రేట్లని భారీగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 5న విడుదలవుతున్న 'గాడ్ ఫాదర్' ది ఘోస్ట్  సినిమాల టికెట్ రేట్లని భారీగా పెంచేస్తారా?  లేక  సాధారణ టికెట్ రేట్లే అందుబాటులో వుంటాయా అన్నది ఇంత వరకు మేకర్స్ ప్రకటించలేదు.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందినవే. బజ్ ని బట్టి టికెట్ రేట్లని మేకర్స్ ప్రకటించే అవకాశం వుందని కొంత మంది అంటున్నారు. కానీ ఈ మధ్య టికెట్ రేట్ పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఆ విషయాన్ని  'గాడ్ ఫాదర్' ది ఘోస్ట్ మేకర్స్ దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్ల విషయంలో మెట్టు దిగుతారా?  లేక భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి టికెట్ రేట్లు పెంచాల్సిందే అంటారా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.