'వలిమై' గ్లిమ్స్: బైక్ రేసింగ్ లో అజిత్ ని ఢీ కొట్టడానికి కార్తికేయ రెడీ..!

Thu Sep 23 2021 20:16:07 GMT+0530 (IST)

Glimpses Of Valimai Movie

కోలీవుడ్ స్టార్ హీరో 'తలా' అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ''వలిమై''. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ గుమ్మకొండ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - ఫస్ట్ సింగిల్ - కార్తికేయ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'వలిమై' ఫస్ట్ గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.'వలిమై' గ్లిమ్స్ చూస్తుంటే ఇది బైక్ రేస్ నేపథ్యంలో తెరకెక్కే పవర్ ఫుల్ కాప్ డ్రామా అని తెలుస్తోంది. బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ - యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ గ్లిమ్స్ ని కట్ చేశారు. ఇందులో అజీత్ - కార్తికేయ లను బైక్ రేసర్లుగా చూపించారు. ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ అలరిస్తున్నాయి. 'అర్జున్.. నువ్వు నా ఈగోని హర్ట్ చేశావ్.. గేమ్ కోసం రెడీగా ఉండు' అని కార్తికేయ సీరియస్ గా అంటుండగా.. 'నేను ఎప్పుడో గేమ్ ని స్టార్ట్ చేశాను కిడ్' అని అజిత్ కూల్ గా సమాధానం ఇస్తున్నాడు. కార్తికేయ డిఫెరెంట్ మెకోవర్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

'వలిమై' చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ - విజువల్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్ కుమార్.. ఈ చిత్రంలో రిస్కీ ఛేజింగ్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్లిమ్స్ కి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - నిరావ్ షా కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.

ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది. బాణీ - సుమిత్ర - అచ్యుంత్ కుమార్ - యోగి బాబు - రాజ్ అయ్యప్ప - పుగజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నెర్కొండ పార్వై' తర్వాత అజిత్ - వినోద్ - బోనీ కపూర్ కలయికలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.