చిరంజీవి అలా .. మోహన్ బాబు ఇలా

Sun Dec 05 2021 08:00:02 GMT+0530 (IST)

Giri babu About Chiranjeevi and Mohan babu

గిరిబాబు .. తెలుగు తెరపై చెరగని విలనిజం. అప్పట్లో డైలాగ్స్ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా ప్రత్యేకతను కనబరిచిన నటులలో ఆయన ఒకరు. సీనియర్ విలన్స్ కి కొడుకుగా .. మెయిన్ విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. ఇలా ఏ పాత్ర ఇచ్చినా గిరిబాబు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని కలిగించిన నటుడాయన.చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి తనని తాను నిరూపించుకున్నవారాయన. అలాంటి గిరిబాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

"గతంలోకి వెళితే చాలా ఆనదంగాను .. ఆశ్యర్యంగాను అనిపిస్తుంది. పది సినిమాలు తీశాను .. అన్నిటికీ కథలు నేనే .. డైరెక్షన్ నేనే. కష్టాలు పడ్డాను .. నష్టాలు పడ్డాను .. సాహసాలు చేశాను .. త్యాగాలు చేశాను.

చివరికి ఎంతోకొంత సాధించి ఈ రోజున ఇలా ఉన్నాను. కాలేజ్ చదువు అయిపోయిన తరువాత ఊళ్లో నాటకాలు వేసేవాడిని. నేను నాటకాలు వేయడం మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు. అలాగే సినిమాల్లో ప్రయత్నాలు చేయటం కూడా ఆయనకి నచ్చేది కాదు. కానీ సినిమాల పట్ల గల పిచ్చితో నేను వినిపించుకోలేదు.

సినిమాల పట్ల గల ఇష్టంతో రెండు వందలో .. మూడు వందలో తీసుకుని మద్రాస్ ట్రైన్ ఎక్కేశాను. సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడిని. డబ్బు అవసరమైనప్పుడు ఇంటి దగ్గర నుంచి పంపించేవారు. నేను .. మోహన్ బాబు రూమ్మేట్స్ గా ఉండేవాళ్లం. మురళీ మోహన్ .. శరత్ బాబు .. మేమంతా స్నేహితులుగా ఉండేవాళ్లం.

ఇప్పటికీ కూడా కలుసుకుంటూనే ఉంటాము. సినిమాల్లో నాకు ముందుగా అవకాశం వచ్చింది. ఆ తరువాత రెండేళ్లకు మోహన్ బాబుకు ఛాన్స్ వచ్చింది. నేను 'జగమే మాయ' సినిమాతో పరిచయమైతే ఆయన 'స్వర్గం నరకం' సినిమాతో పరిచయమయ్యాడు.

చిరంజీవి నా తరువాతనే ఇండస్ట్రీకి వచ్చాడు. చాలా మంచి మనిషి .. మంచి ఆర్టిస్టు. నాకు మంచి మిత్రుడు .. నేను అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎక్కడ కనిపించినా ఎంతో ఆత్మీయంగా హగ్ చేసుకుంటాడు. మొదటి నుంచి కూడా అహంభావానికి దూరంగా .. అందరితో సామరస్యంగా ఉండేవాడు.

ఆయనపై ఎలాంటి మచ్చలేదు .. మెగాస్టార్ అనేది సార్థక నామధేయమే. 'సైరా' చూసి నేను ఫోన్ చేస్తే చాలా సంతోషపడ్డాడు. సినిమాల్లో ప్రయత్నిస్తూ ఎన్నో కష్టాలు పడ్డాను .. రెండు మూడు రోజులు ఫుడ్డు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ నేను 'ఇది నా విచిత్రకథ' అనే పుస్తకంగా రాశాను. ఆ పుస్తకాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.