కోర్టుకెళ్లాలా? సీఎం జగన్ తో మాట్లాడాలా? గిల్డ్ మల్లగుల్లాలు!!

Thu Apr 22 2021 10:00:01 GMT+0530 (IST)

Gild Producers Gave Huge Shock To Cm Ys Jagan

ఏపీలో సినిమా టిక్కెట్టు ధరల తగ్గింపు నిర్ణయం ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇది కేవలం వకీల్ సాబ్ ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని విసిరిన పంచ్ కానే కాదు. రాబోవు భారీ చిత్రాలన్నిటిపైనా సమ్మెట పోటు. ఈ తగ్గింపుతో స్టార్ హీరోల భారీ పారితోషికాలపైనా.. దర్శకుల అదనపు వాటాలపైనా బిగ్ పంచ్ పడిపోతోంది. ఇది నిర్మాతల లాభాల్ని.. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ బయ్యర్ షేర్లను కూడా ప్రభావితం చేసే అతి పెద్ద పంచ్ అని విశ్లేషిస్తున్నారు.ఇక దీనివల్ల థియేటర్లకు ఆడియెన్ రావడం పెరుగుతుందని చిన్న సినిమాలకు మేలు జరుగుతుందని సినిమాలు తీసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని చాలామంది చిన్న నిర్మాతలు విశ్లేషించారు. ఆడియెన్ ని కుటుంబ సమేతంగా థియేటర్లకు రప్పించడం అవసరమన్న అభిప్రాయం మెజారిటీ నిర్మాతల్లో నెలకొంది. ఏపీలో నిర్ణయమే తెలంగాణలో కేసీఆర్ కూడా తీసుకోవాలని పలువురు చిన్న నిర్మాతలు కోరుతుండడం ఆశ్చర్యపరుస్తోంది.

ఇదంతా ఇలా ఉంటే.. దీనిపై గిల్డ్ నిర్మాతల జూమ్ మీటింగులు మరోవైపు వేడెక్కిస్తున్నాయి. టిక్కెట్టు ధరల తగ్గింపు నిర్ణయంపై  కోర్టుకెళ్లాలా?  లేక ఏపీ ప్రభుత్వ అధికారులతో సీఎం జగన్ తో మంతనాలు సాగించాలా? అన్నదానిపై గిల్డ్ నిర్మాతల సంఘం మల్లగుల్లాలు పడుతోందని సమాచారం.

టికెట్ ధరలను డిమాండ్ కు అనుగుణంగా పెంచలేనప్పుడు పెద్ద సినిమాలను పంపిణీదారులకు అధిక ధరలకు అమ్మడం సాధ్యం కాదు. ఇది హీరోల వేతనాన్ని అలాగే నిర్మాతల ఆదాయాన్ని దర్శకుల వాటాలను ప్రభావితం చేస్తుందని గిల్డ్ నిర్మాతల్లోనే చర్చ సాగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా వ్యాపారంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది? టికెట్ ధరలపై నిర్ణయం ప్రభుత్వాలు తీసుకోవడం సరైనదేనా? అన్న చర్చ కూడా జూమ్ మీటింగ్ లో సాగింది. టాలీవుడ్ లో ఆర్.ఆర్.ఆర్  సహా ఎన్నో భారీ చిత్రాలు మునుముందు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. వీటన్నిటినీ టిక్కెట్టు ధరల తగ్గింపుతో ఆడించడం కుదరదు. అలా ఆడిస్తే హీరోల పారితోషికాలు కానీ దర్శకుల అదనపు వాటాలు కానీ అందవు. వాటన్నిటిలోనూ షేర్ తగ్గిపోతుందని విశ్లేషించారు.  దీనిపై కోర్టకు వెళ్లాలా వద్దా?  లేదా ప్రభుత్వంతోనే లాలూచీ పడి ఏదోలా బతిమాలి బామాలి.. ఒప్పించాలా? అన్నదానిపై గిల్డ్ వాళ్లు తర్జనభర్జన పడుతున్నారన్నది ఓ గుసగుస.

ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా మెలగడమే సరైన నిర్ణయమని మెజారిటీ నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ముళ్లు వెళ్లి ఆకుపై పడినా ఆకు వెళ్లి ముళ్లుపై పడినా ఆకుకే కదా కన్నం! అన్నది పలువురి విశ్లేషణ.