Begin typing your search above and press return to search.

'గని' సాంగ్ ప్రోమో: దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరు'గని'..!

By:  Tupaki Desk   |   26 Oct 2021 1:44 PM GMT
గని సాంగ్ ప్రోమో: దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని..!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గని''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా ప్రమోషన్స్​ ను మొదలుపెట్టేశారు.

''గని'' చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇటీవల 'ఫస్ట్​ పంచ్​' పేరుతో విడుదలైన గ్లింప్స్​ కు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కింది. ఈ నేపథ్యంలో ఈ​ మూవీ నుంచి మరో క్రేజీ అప్​డేట్​ వచ్చేసింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'గని అంథెమ్' లిరికల్​ సాంగ్ ప్రోమో​ను మంగళవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది.

'గని' చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ''దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని.. దే కాల్ హిమ్ గని.. లోకం తనకని..'' అంటూ తాజాగా వచ్చిన సాంగ్​ ప్రోమోలో వరుణ్ తేజ్ బాక్సర్ గా రెడీ అయ్యే విధానాన్ని చూపించారు. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాకపోతే అదే సమయంలో ఎప్పటిలాగే థమన్ నుంచి ఆల్రెడీ విన్న ట్యూన్ అని కామెంట్స్ వస్తున్నాయి. 'వకీల్ సాబ్' సినిమాలోని 'సత్యమేవ జయతే' ట్యూన్ ని రిపీట్ చేశారని అంటున్నారు.

'గని' ఫస్ట్ సింగిల్ పూర్తి లిరికల్ వీడియోను రేపు బుధవారం ఉదయం 11.08 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాటకు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

కాగా, 'గని' చిత్రంలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ తేజ్ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కఠినమైన వర్కౌట్స్ చేయడంతో పాటుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి 'గని' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ - అల్లు బాబీ కంపెనీ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అబ్బూరి రవి ఈ సినిమాలో డైలాగ్స్ రాస్తున్నారు. జార్జ్ సి.విలియమ్స్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ని బాక్సింగ్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'గని'.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ కు 'తమ్ముడు' తరహాలోనే.. వరుణ్ తేజ్ కెరీర్ లో 'గని' నిలిచిపోతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.