Begin typing your search above and press return to search.

సూర్యకి తెలుగులో క్రేజ్ తెచ్చిపెట్టిన 'గజిని' కి 17 ఏళ్ళు..!

By:  Tupaki Desk   |   29 Sep 2022 3:30 PM GMT
సూర్యకి తెలుగులో క్రేజ్ తెచ్చిపెట్టిన గజిని కి 17 ఏళ్ళు..!
X
తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోలలో సూర్య ఒకరు. అందుకే ఆయన నటించే సినిమాలన్నీ తమిళ్ తో పాటుగా ఇక్కడ కూడా డబ్బింగ్ చేయబడుతుంటాయి. అయితే టాలీవుడ్ లో సూర్య కు ఇంతటి క్రేజ్ ఏర్పడటానికి కారణమైన సినిమా మాత్రం ''గజిని'' అని చెప్పాలి.

సూర్య - ఆసిన్ జంటగా మురుగ‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ''గజిని''. తెలుగులో ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. 2005 సెప్టెంబ‌ర్ 29న విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ ఏడాదిలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

'మ‌మెంటో' అనే హాలీవుడ్‌ మూవీ స్పూర్తితో.. షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో ''గజిని'' చిత్రాన్ని తెరకెక్కించారు మురగదాస్. సంజయ్ రామస్వామిగా సూర్య.. కల్పన గా ఆసిన్ అద్భుతమైన నటన కనబరిచారు. నయనతార ఓ కీలక పాత్రలో మెరిసింది. హరీష్ జైరాజ్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ఆసక్తికరమైన క‌థ‌ క‌థ‌నాల‌తో ప్రధాన నటీనటుల అవుట్ స్టాండింగ్ పెర్పామెన్స్ మరియు అద్భుతమైన మ్యూజిక్ ఇవ‌న్నీ క‌లిపి 'గ‌జినీ' సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఈ సినిమా వ‌చ్చి ఇన్నేళ్లవుతున్నా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడు టెలికాస్ట్ చేసినా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుని చూస్తుంటారు.

అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన 'గజిని' సినిమాను 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశార‌ట‌. దర్శకుడు ఏ.ఆర్ మురుగుదాస్ ముందుగా మహేష్ బాబు - వెంకటేష్ - కమల్ హాసన్ - ర‌జినీ కాంత్ - విజ‌య్ కాంత్‌ - విజ‌య్ - పవన్ కళ్యాణ్ - మాధవన్.. ఇలా ప‌లువురు హీరోల‌తో ఈ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడట. అందరూ ఏదొక కారణంతో గజినీ కథను సున్నితంగా తిరస్కరించారట.

చివరకు అజిత్ హీరోగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది. కానీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగిన తర్వాత హీరోకి నిర్మాత‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చి మ‌ధ్య‌లోనే ఆపేశారు. దీంతో మురగదాస్ ఈ కథను సూర్య‌కు చెప్పడం.. కథ నచ్చడం.. వెంటనే సెట్స్ మీదకు వెళ్లడం జరిగిపోయాయి. అప్పటి వరకూ తమిళ్ లో మాత్రమే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య‌.. 'గజిని' తో సౌత్ ఇండియా అంత‌టా పాపుల‌ర్ అయ్యాడు.

ఇక 'గ‌జినీ' తెలుగు తమిళ భాషల్లో బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ అయిన త‌ర్వాత.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ ఖాన్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. మురగదాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర‌వింద్ ఈ సినిమాని నిర్మించారు. హిందీలోనూ ఈ సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ అయింది.

ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అవ్వడమే కాకుండా.. సూర్య‌కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన 'గజిని' సినిమా విడుదలై నేటికి 17 ఏళ్ళు పూర్తయ్యింది. టాలీవుడ్ లో ఇన్నేళ్ళుగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్న వర్సటైల్ హీరోకి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. రాబోయే చిత్రాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.