Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్: విద్యార్థి నాయ‌కుడు జార్జిరెడ్డి త‌డాఖా

By:  Tupaki Desk   |   8 Oct 2019 8:02 AM GMT
ట్రైల‌ర్: విద్యార్థి నాయ‌కుడు జార్జిరెడ్డి త‌డాఖా
X
బ‌యోపిక్ హీట్ ఇప్ప‌ట్లో త‌గ్గేట్టు లేదు. మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ మొద‌లు.. ప్ర‌ముఖుల జీవితాల్ని వెండితెర‌పై ఆవిష్క‌రించేందుకు ఆస‌క్తి మొద‌లైంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ ని తీశారు. సైనా నెహ్వాల్ బ‌యోపిక్.. పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్.. ఇవ‌న్నీ ఒకెత్తు అనుకుంటే.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ ఇంకో ఎత్తు. ఇక‌ ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి బ‌యోపిక్ వీట‌న్నిటికంటే విభిన్న‌మైన‌ది. దీనికి త‌గ్గ‌ట్టే ఆ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆసక్తిని రేకెత్తించింది. దాదాపు ఆరేళ్ల క్రితం `ద‌ళం` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేసిన వ‌ర్మ శిష్యుడు జీవ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆరేళ్ల విరామం త‌రువాత జీవ‌న్‌రెడ్డి ఈ క‌థ‌నే ఎందుకు ఎంచుకున్నాడు? అస‌లు జార్జిరెడ్డి ఎవ‌రు?. అత‌ని వెన‌కున్న క‌థేంటి? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తించాయి.

దుందుడుకు స్వభావం ఉన్న ఓ విద్యార్థి నాయ‌కుడు చ‌రిత్ర‌లో ఏం సాధించాడు? అన్న క‌థాంశాన్ని ఎంచుకుని జీవ‌న్ స‌రికొత్త ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. 1967లో ఉస్మానియాలో సాగిన క‌థాంశ‌మిది. జార్జిరెడ్డి పుట్టింది కేర‌ళాలోని పాల్ఘాట్ లో. కానీ పెరిగింది అంతా హైద‌రాబాద్ లోనే. దుందుడుకు స్వ‌భావం, అభ్యుద‌య భావాలు.. క‌ళ్ల‌ముందు అన్యాయం జ‌రుగుతుంటే చూస్తే ఊరుకోలేని త‌త్వం జార్జిరెడ్డి సొంతం. అవే అత‌న్ని వామ‌ప‌క్ష భావాల వైపు న‌డిపించి కాలేజీ ద‌శ‌లోనే రెబ‌ల్ గా మార్చాయి. ఒక లీడ‌ర్ ని చేశాయి. 60వ ద‌శ‌కంలో ఉస్మానియా క్యాంప‌స్ లో విప్ల‌వ శంఖారావాన్ని పూరించిన విద్యార్థి నాయ‌కుడిగా జార్జిరెడ్డి ఓ వెలుగు వెలిగారు. బాక్సింగ్ ఛాంపియ‌న్ గా గోల్డ్ మెడ‌ల్ ని సొంతం చేసుకున్న జార్జిరెడ్డి విప్ల‌వ‌మే ఊపిరిగా స‌మ‌స‌మాజ స్థాప‌న ధ్యేయంగా అడుగులు వేశాడు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో మార్పుకు కార‌ణ‌మ‌య్యాడు. 25 ఏళ్ల వ‌య‌సులోనే త‌న ఆయువునే ధార‌పోశాడు. క్యాంప‌స్ లో రాజ‌కీయ ఆదిప‌త్య‌ గొడ‌వ‌లు ఏ స్థాయికి చేరాయో ప్ర‌పంచానికి చాటి చెప్పాడు.

అందుకే విద్యార్థి లోకానికి అత‌నో వేగుచుక్క‌. ఓ రోల్ మోడ‌ల్‌. పీడీఎస్‌యూ(ప్రోగ్రెసీవ్ డెమొక్రెటివ్ స్టూడెంట్స్ యూనియ‌న్‌)ని స్థాపించి యూనివ‌ర్సీటీ రాజ‌కీయాల్లో కొత్త అధ్యాయానికి తెర‌తీశారు. ద‌శాబ్దాల కింద‌ట హీరోగా నిలిచిన జార్జిరెడ్డి ఉస్మానియా క్యాంప‌స్ లోనే హ‌త్యకు గురికావ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. అలాంటి వ్య‌క్తి జీవితాన్ని నేటి త‌రానికి చూపించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని చాలా వ్య‌య ప్ర‌యాస‌కోర్చి తెర‌పైకి తీసుకొస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు నెల‌కొన్నాయి. `ఏ బ‌యోపిక్ ఆఫ్ ద ఫ‌ర్గాటెన్ లీడ‌ర్` అనే ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ తో ఈ చిత్రాన్ని కూపొందిస్తున్నారు. సాండీ అలియాస్ సందీప్ ఇందులో జార్జిరెడ్డిగా నటించాడు. తాజాగా రివీల్ చేసిన ట్రైల‌ర్ ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా సాగింది. ఉస్మానియా విద్యార్థి క‌థ ఇది అని చెప్పేందుకు నాటి కాలంలోకి తీసుకెళ్లేలా బెల్ బాట‌మ్ క‌ల్చ‌ర్ ని ఆవిష్క‌రించారు. అయితే జార్జిరెడ్డి ఉద్య‌మాన్ని ప్ర‌భావవంతంగా చూపించినా ట్రైల‌ర్ క‌టింగ్ లో చిన్న‌పాటి గంద‌ర‌గోళం ఇబ్బందిక‌రం. జార్జిరెడ్డి తో పాటు చుట్టూ ఉన్న విద్యార్థి లోకాన్ని స‌మ‌ప్రాధాన్య‌త‌తో చూపించ‌డం కొంత క‌న్ఫ్యూజ‌న్ కి గురి చేసింది. అయితే స్క్రీన్ ప్లే ప‌రంగా.. క‌థ కంటెంట్ ప‌రంగా అలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా స్ట్రెయిట్ గా నేరేట్ చేస్తే విజ‌యం ద‌క్కించుకునే వీలుంది. నేటిత‌రం విద్యార్థుల‌కు తెలియాల్సిన ఒక గొప్ప క‌థ జార్జిరెడ్డిది అన‌డంలో సందేహ‌మే లేదు. జీవ‌న్ ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతుంది అన్న‌ది చూడాలి.