ట్రైలర్: దీపికా బికినీ అందాలు - లిప్ లాక్స్ తో నిండిపోయిన 'గెహ్రైయాన్'

Thu Jan 20 2022 17:09:45 GMT+0530 (IST)

Gehraiyaan Official Trailer

కరోనా నేపథ్యంలో అనేక హిందీ చిత్రాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. థియేటర్లలో విడుదల చేసిన సినిమాలకు కూడా పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో చాలామంది ఫిలిం మేకర్స్ ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు 'కపూర్ అండ్ సన్స్' ఫేమ్ శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ''గెహ్రైయాన్'' సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.''గెహ్రాయాన్'' చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె - అనన్య పాండే - సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలు పోషించారు. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో వాలెంటైన్స్ వీక్ లో 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'గెహ్రైయాన్' ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తుంటే మూడు పాత్రల మధ్య భావోద్వేగాలు.. విచిత్రమైన బంధాల నేపథ్యంలో సాగే ఓ వైవిధ్యమైన కథతో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. అలీషా (దీపికా పదుకొణె) తన బాధ్యత గురించి పట్టించుకోని భర్తతో కలిసి జీవించడంలో ఇబ్బంది పడుతూ కనిపిస్తోంది. అదే సమయంలో ఆమె కజిన్ తియా (అనన్య పాండే) తన ప్రియుడు జైన్ (సిద్ధాంత్ చతుర్వేది) తో పెళ్లికి రెడీ అవుతుంది. అయితే అనన్య తన ఫియాన్సీ సిద్ధాంత్ ను దీపికా కు పరిచయం చేసిన తర్వాత.. ఆ పరిచయం దీపికా - సిద్ధాంత్ మధ్య లైంగిక సంబంధానికి దారి తీసినట్లు కనిపిస్తోంది. ఈ విషయం బయటపడ్డాక వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే మిగిలిన కథ.

'గెహ్రాయాన్' సినిమాలో దీపికా పదుకొణె నటన అందరినీ మంత్రముగ్ధులను చేయడమే కాకుండా.. ఆమె బికినీ అందాలు మరియు లిప్ కిస్సింగ్ లు షాక్ కి గురి చేస్తున్నాయి. ఒకే సమయంలో ప్రేమను బాధను చూపిస్తూ అద్భుతమైన పెరఫార్మెన్స్ చూపించింది. మరోవైపు అనన్య పాండే మరియు సిద్ధాంత్ కూడా తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. ధైర్య కర్వా - నజీజుద్దీన్ షా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో విజువల్స్ - బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన ''83'' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో రాబోయే దీపికా పదుకునే 'గెహ్రైయాన్' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.