Begin typing your search above and press return to search.

'జోహార్' దర్శకుడితో 'గీతా ఆర్ట్స్2' కొత్త సినిమా..!

By:  Tupaki Desk   |   30 Jun 2022 6:11 AM GMT
జోహార్ దర్శకుడితో గీతా ఆర్ట్స్2 కొత్త సినిమా..!
X
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'గీతా ఆర్ట్స్' కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సారథ్యంలో నడిచే ఈ సంస్థ నుంచి గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు - సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ కు అనుబంధ సంస్థగా 'గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్' బ్యానర్ ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే.

యువ నిర్మాత బన్నీ వాసు ఆధ్వర్యంలో నడిచే జీఏ2 బ్యానర్ లో హై బడ్జెట్ సినిమాలతో పాటుగా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటుగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.

GA2 పిక్చర్స్ లో ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాలు రూపుదిద్దుకుంటుండగా.. తాజాగా ఈ బ్యానర్ లో మరో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. 'జోహార్' 'అర్జున ఫాల్గుణ' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తేజ మర్ని దర్శకత్వంలో బన్నీ వాస్ - విద్య మాధురి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది.

ఈరోజు గురువారం గీతా ఆర్ట్స్2 లో 'ప్రొడక్షన్ నెంబర్ 8' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ - వరలక్ష్మి శరత్ కుమార్ - రాహుల్ విజయ్ - శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మురళీ శర్మ - బెనర్జీ - పవన్ తేజ్ కొణిదెల ఇతర పాత్రలు పోషించనున్నారు.

ఇది పూర్తిగా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా అని తెలుస్తోంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. భాను ప్రతాప కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఇకపోతే అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ లో రూపొందిన 'పక్కా కమర్షియల్' సినిమా రేపు శుక్రవారం థియేటర్లో విడుదల కాబోతోంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బన్నీ వాసు. అలానే అల్లు శిరీష్ తో 'ప్రేమ కాదట' అనే న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు.