Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి వచ్చిన సెన్సేషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామా..!

By:  Tupaki Desk   |   14 Jan 2022 2:30 AM GMT
ఓటీటీలోకి వచ్చిన సెన్సేషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామా..!
X
ప్రస్తుతం ప్రాంతీయ సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయని చెప్పొచ్చు. ఓవైపు భారీ సినిమాలు మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో నటీనటులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'గరుడ గమన వృషభ వాహనం' అనే కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల ప్రశంసలు అందుకుంది.

''గరుడ గమన వృషభ వాహన'' సినిమా గతేడాది నవంబర్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. హైదరాబాద్ లాంటి పలు నగరాల్లోనూ ఈ కన్నడ సినిమా షోలు వేశారంటేనే దీనిపై ఎంత హైప్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిషబ్ శెట్టి - రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. దీనికి రాజ్ బి శెట్టినే దర్శకత్వం వహించారు. కాఫీ గ్యాంగ్ స్టూడియో - లైటర్ బుద్దా ఫిలింస్ పతాకాలపై రవి రాయ్ బి వి - కలస - వచన్ శెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇద్దరు స్నేహితులు శత్రువులను ఎదుర్కొనే క్రమంలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్స్ గా చాలా ఎత్తుకు ఎదగడం.. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎదురైన సవాళ్లు.. వారి పతనానికి దారి తీసిన పరిస్థితుల సమూహారమే 'గరుడ గమన వృషభ వాహన' కథాంశం. రొటీన్ స్టోరీ అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా పూర్తిగా వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని రూపొందించారు.

దర్శకుడు రాజ్ బి శెట్టితో పాటు రిషబ్ శెట్టిల అద్భుతమైన నటన.. మాస్ ని ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో హైలైట్ గా నిలిచాయి. మంచి వసూళ్లతో పాటుగా విమర్శకుల ప్రశంసలను అందుకున్న 'గరుడ గమన వృషభ వాహన' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. జీ5 డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో కూడా విశేష ఆదరణ దక్కించుకుంటోంది. సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉండటంతో ఇతర భాషల వారు కూడా సినిమా చూస్తున్నారు.

ఇకపోతే 'గరుడ గమన వృషభ వాహన' సినిమా తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంతం చేసుకున్నారు. అలానే తెలుగు రైట్స్ ను ఓ స్టార్ ప్రొడ్యూసర్ తీసుకున్నారని.. వేసవిలో ప్రకటించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతానికైతే ఈ క్రేజీ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డ్యూయెట్స్ - కామెడీతో కూడిన రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులు.. వాస్తవానికి దగ్గరగా వుండే కంటెంట్ ను ఇష్టపడేవారు ఈ సినిమా చూసేయొచ్చు.