నాకౌట్ పంచ్ కు సిద్ధమైన ‘గని’.. మ్యాచ్ సాగుతుందా?

Thu Apr 22 2021 11:00:01 GMT+0530 (IST)

Gani ready for knockout punch

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ 'గని'. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా.. మరో పిక్ బయటకు వచ్చింది.ఈ పోస్టర్లో బాక్సింగ్ రింగ్ లోకి దిగిన యోధుడిలా కనిపిస్తున్నాడు వరుణ్. గ్లౌజులతో పంచ్ ను ఎక్కుపెట్టిన గని.. టార్గెట్ పై కన్నేసిన వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాడీ మెగా హీరో. స్పెషల్ ట్రైనర్ సమక్షంలో సాధన చేసి.. తన బాడీని ప్రొఫెషనల్ బాక్సర్ రేంజ్ లో తీర్చి దిద్దుకున్నాడు.

వరుణ్ గత చిత్రాల కన్నా మరింత ఫిట్ గా కనిపిస్తుండడాన్ని ఈ పోస్టర్ లో గమనించొచ్చు. అంతేకాదు.. క్రితం కన్నా ఒళ్లు కూడా చేశాడు. మొత్తాన్ని బాక్సింగ్ సమరానికి సన్నద్ధమైన చురకత్తిలా ఉన్నాడు. ఇదే ఊపులో షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేయాలనే ఉత్సాహంలోనూ ఉన్నాడు. కానీ.. ఎంత వరకు సాగుతుందన్నదే సందిగ్ధంగా మారింది.

ఇప్పటికే.. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మొదలైంది. దీంతో.. షూటింగ్ లు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో కూడా చెప్పలేకుండా ఉంది. నిత్యం వేలాది కేసులు పెరుగుతుండడంతో.. భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే.. మెగాస్టార్ ఆచార్య వాయిదా వేశారు. మరి వరుణ్ గని షూటింగ్ ఏ మేరకు కొనసాగుతుందో చూడాలి.