మూగబోయిన మధుర గాత్రం.. జి.ఆనంద్ ను బలిగొన్న కరోనా!

Fri May 07 2021 13:03:35 GMT+0530 (IST)

G Anand Passes Away

70వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన గీతాలను ఆలపించిన మధుర గాయకుడు జి.ఆనంద్ ను కొవిడ్ బలిగొన్నది. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన.. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో గురువారం సాయత్రం తుదిశ్వాస విడిచారు.కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోయిన వేళ.. చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దల సహకారంతో వెంటిలేటర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ పొందగలిగారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించింది. ఆక్సీజన్ లెవల్స్ మరీ కిందకు పడిపోయాయి. 55 శాతానికి ఆక్సీజన్ స్థాయి తగ్గిపోవడంతో ఆయన కొవిడ్ తో పోరాడలేకపోయారు.

జి.ఆనంద్ ఎంతో మంది స్టార్ హీరోలకు పాటలు పాడారు. ‘‘స్నేహ బంధము.. ఎంత మధురమూ’’ ‘‘అదిగో గౌతమి.. ఇదిగో భద్రగిరి’’ అంటూ సాగిపోయే ఎవర్ గ్రీన్ పాటలను పాడింది ఆనందే. ఘంటసాల మరణం తరువాత 1970లలో ప్రముఖ గాయకుడిగా వెలుగొందిన ఆనంద్.. తెలుగు చిత్రపరిశ్రమలోని ఎంతో మంది హీరోలకు ఆయన గాత్రదానం చేశారు. ఇక దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

జి. ఆనంద్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చిరంజీవి సినీ కెరీర్లో మొదటి పాటను పాడింది ఆయనే కావడం విశేషం. ‘‘ఎన్నియల్లో.. ఎన్నియల్లో.. ఎందాకా.. అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకు గాత్రదానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదుస్వభావి చిరు దరహాసి జి.ఆనంద్ కర్కశమైన కరోనా బారినపడి ఇకలేరు అని నమ్మలేకపోతున్నాను. మొట్టమొదటిసారి వెండితెర మీద ఆయన పాడిన పాటకే నేను నర్తించాననే విషయం ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన అవినాభావ బంధం ఏర్పరిచింది’’ అంటూ ట్వీట్ చేశారు.