Begin typing your search above and press return to search.

సుకుమార్​ శిష్యులకు ఫుల్​ డిమాండ్​.. అప్పుడే ఇన్ని భారీ ఆఫర్లా!

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:39 PM GMT
సుకుమార్​ శిష్యులకు ఫుల్​ డిమాండ్​.. అప్పుడే ఇన్ని భారీ ఆఫర్లా!
X
హీరో, హీరోయిన్లకే కాదు కొందరు దర్శకులకూ విశేష అభిమానగణం ఉంటుంది. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌ ఉంటుంది. ఈ కోవకి చెందిన వారిలో సుకుమార్‌ ఒకరు. ఆర్య సినిమాతో మెగాఫోన్‌ పట్టిన ఆయన 'పుష్ప' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మొదటి సినిమాతోనే అటు ఇండస్ట్రీని ఇటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారీ లెక్కల మాస్టర్. దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్​గా తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు.సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లతో పోలిస్తే సుకుమార్ అందరి కన్నా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు చాలామంది ఇప్పుడు పరశ్రమలో డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్లను మరీ అంతగా పట్టించుకోవాల్సి అవసరం ఉండదు. కానీ సుకుమార్ మాత్రం స్వయంగా ఆ బాధ్యత తీసుకుని మరీ తన అసిస్టెంట్లకు మంచి కెరీర్​ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఓ మంచి దర్శకుడుగా వారు ఎదగడానికి తనవంతుగా ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ తోడుగా నిలుస్తారు.

ఇదే విషయాన్ని ఆ శిష్యులు కూడా చాలా సందర్భాల్లో చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ ఆ ఆనందంలోనే ఉన్నారు. ఆయన విషయంలో ఇదే జరుగుతోంది. ఈ లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పడుతూ.. చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడితో సినిమా అంటే హీరోలు కూడా ముందు వెనుక ఆలోచించకుండా సరే అంటున్నారు. నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు. ఈయన సుకుమార్‌కు ప్రియ శిష్యుడు. గురువు గారి పేరు నిలబెడుతూ తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్​తో ఏకంగా రామ్​చరణ్​తో ఆర్​ సీ 16 చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్​ దాదారు రూ.270కోట్లతో నిర్మించనుందని టాక్​. అయితే బుచ్చిబాబుకు మరిన్ని ఆఫర్స్​ కూడా వస్తున్నాయట. కానీ ఇంకా అతడు దేనికి ఓకే చెప్పకుండా ఆర్​ సీ 16తోనే బిజీగా గడపుతున్నాడట.

నాని హీరోగా నూతన దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం దసరా. ఈ డైరెక్టర్​ కూడా సుక్కు స్కూల్​ నుంచి వచ్చినవాడే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇతడికి స్టార్ ప్రొడ్యూసర్​ దిల్ రాజు నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే దసరాలో కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 30 ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కూడా అదిరింది.

మరో యంగ్ హీరో సాయితేజ్‌ కథానాయకుడిగా... కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈచిత్రానికి విరూపాక్ష అనే పేరు ఖరారు చేశారు. సంయుక్త మేనన్‌ కథానాయిక. సుకుమార్‌ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్​తోనే ఆకట్టుకున్న కార్తీక్​ దండుకు సినిమా విడుదల కాకముందే మరిన్ని ఆఫర్స్​ వస్తున్నాయట. కానీ అతను వీరుపక్ష విడుదలయ్యాకే ఒప్పుకోవాలని అనుకుంటున్నాడట. చూడాలి మరి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో.

ఇకపోతే అంతకు ముందు సుకుమార్ స్కూల్ నుంచి వచ్చి కుమారి 21 ఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు సూర్య ప్రతాప్. ఆ తర్వాత 18 పేజెస్​తో డీసెంట్​ హిట్​ను అందుకున్నారు. ఇక ప్లే బ్యాక్ సినిమా దర్శకుడు హరి ప్రసాద్ జక్కా కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. చిన్న సినిమా అయినా దీనికి మంచి టాక్ వచ్చింది. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. వీరందరూ మంచి విజయాలను అందుకున్నారు. ఇంకా చాలా మందే ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.