స్నేహితుడి మెమరబుల్ గిఫ్ట్.. మెగాస్టార్ ఫుల్ హ్యాపీస్!

Sun Apr 18 2021 15:00:01 GMT+0530 (IST)

Friend's Memorable Gift .. Megastar Full Happy!

బహుమతులు ఎన్నో రకాలుగా ఉంటాయి.. కానీ.. కొన్ని వెరీ వెరీ స్పెషల్ గా ఉంటాయి. వాటిని రీప్లేస్ చేయడం కూడా కుదరదు. అలాంటి గిఫ్ట్ అందించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ఆనందంలో ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఆయన స్నేహితుడు. అది చూసిన బిగ్ బీ ఆనందాన్ని హద్దుల్లేకుండాపోయాయట. అంతేకాదు.. ఎలా స్పందించాలో కూడా మాటరాలేదని స్వయంగా వెల్లడించారు అమితాబ్. మరి అంత గొప్ప బహుమతి ఏంటో మనమూ చూద్దామా!ప్రతీ మనిషికి తొలి వస్తువు మీద ఉన్న ప్రేమ ఇతరుల అంచనాలకు అందదు. అది కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ విధంగా అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన తొలి కారు ‘ఫోర్డ్ ప్రిఫెక్ట్’. ఈ కారును ఆయన 1950లో వినియోగించారు. ఎల్లో కలర్ లో ఉన్న ఆ కారు అంటే.. బిగ్ బీకి వల్లమాలిన ప్రేమంట. అయితే.. కాల క్రమంలో ఆయన కారు శిథిలమైందో.. గ్యారేజ్ లో రెస్ట్ తీసుకుంటుందో తెలియదుగానీ.. వేరే వాహనాలు వాడుతోంది అమితాబ్ ఫ్యామిలీ.

అయితే.. ఇటీవల ఓ రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన అమితాబ్ ఇంట్లోంచి బయటకు రాగా.. ఎదురుగా పసుపు కలర్ వాహనం కనిపించిందట. అదికూడా పాత మోడల్. కళ్లజోడు సరిచేసుకొని చూసిన అమితాబ్ కళ్లలో అంతులేని మెరుపు.. అంతకు మించిన ఆశ్చర్యం.. ఆనందం! అవునుమరి.. అది తాను తొలిసారిగా కొనుగోలు చేసిన ఫోర్డ్ ప్రిఫెక్ట్. చక్కగా షోరూమ్ నుంచి తెచ్చిన బండిలా ఉంది. వెంటనే ఓ లడ్డూ తినాలనిపించినంత సంతోషం వేసినట్టుంది బిగ్ బీకి.

అంతేకాదు.. ఆ కారుకు నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ ఇప్పటిది కాదు. అమితాబ్ వాడిన పాత కారు నంబరే.. దీనికి జతచేసి ఉంది. రెండో సారి అవాక్కైన అమితాబ్.. మరో లడ్డూ తినాలంత ఆనందం ఉప్పొంగింది. వెంటనే ఆ కారుపక్కన నిలబడి చక్కనైన ఫోజు ఇచ్చారు. హ్యాపీ మూమెంట్స్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.

మరి అమితాబ్ ను ఇంతగా సర్ ప్రైజ్ చేసిన స్నేహితుడు ఎవరంటే.. ఆయన పేరు అనంత్. ఈ విషయాన్ని స్వయంగా తన బ్లాగులో వెల్లడించారు బిగ్ బీ. 1938 నుంచి 1961 మధ్య ఫోర్డ్ యూకే సంస్థ ఉత్పత్తి చేసిన ఈ కారు.. ఇప్పుడు దేశంలో వేళ్లమీద లెక్కబెట్టేటన్ని కూడా రన్నింగ్ లో ఉన్నాయో లేదో తెలియదు. అలాంటి కారును అందించడంతో అమితాబ్ ఆనంద పరవశానికి లోనయ్యారు.