బిగ్ అప్డేట్: బన్నీ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా..?

Thu Oct 28 2021 13:00:13 GMT+0530 (IST)

Fourth movie in Trivikram combo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చినబాబు) లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 'జులాయి' సినిమాతో మొదటిసారి కలిసిన వీరు ముగ్గురు.. 'సన్నాఫ్ సత్యమూర్తి' తో మరో విజయం అందుకున్నారు. అలానే గతేడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ హిట్ తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా రాబోతోందని హింట్ వచ్చింది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ - సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు నాగవంశీ. 'వరుడు కావలెను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్ప్రైజ్ అంటూ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ని ట్యాగ్ చేయడంతో 'అల వైకుంఠపురములో' కాంబోలో మళ్ళీ రిపీట్ కానుందని అందరూ ఫిక్స్ అయ్యారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తీసే సినిమాలని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో.. మిగతా వారితో రూపొందించే చిత్రాలను సితార ఎంటర్టైన్మెంట్స్ లో తీస్తుంటారు రాధాకృష్ణ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ - త్రివిక్రమ్ కలయికలో సినిమా చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.