రసవత్తరంగా 2022 సంక్రాంతి.. బరిలో నాలుగు సినిమాలు..!

Wed Jul 28 2021 13:02:22 GMT+0530 (IST)

Four Movies Standing In The Box Office

'సంక్రాంతి పండుగ' అంటే టాలీవుడ్ కు సినిమా పండుగ. భారీ ఓపెనింగ్స్ కి బాక్సాఫీస్ కలెక్షన్స్ కు డోకా ఉండదు కాబట్టి ప్రతీ స్టార్ హీరో.. దర్శకనిర్మాతలు సంక్రాంతి సీజన్ లోనే తమ సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంటారు. మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశం వస్తే మధ్యలో దూరాలని చూస్తుంటారు. కరోనా నేపథ్యంలో పోయిన సంక్రాంతి కి 'క్రాక్' 'రెడ్' 'అల్లుడు అదుర్స్' తో పాటుగా డబ్బింగ్ సినిమా 'మాస్టర్' పోటీ పడ్డాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి బెర్త్ కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్స్ వేయడం మొదలు పెట్టేసారు. ఇప్పటికే రెండు సినిమాలు అధికారికంగా ప్రకటించగా.. మరో రెండు సినిమాలు టైమ్ చూసి రిలీజ్ డేట్ ఇవ్వాలని చూస్తున్నాయి.



సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ముందుగా సంక్రాంతి స్లాట్ ని బుక్ చేసుకున్నారు. గతేడాది పెద్ద పండక్కి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. 2022 సంక్రాంతికి ''సర్కారు వారి పాట'' ను బరిలోకి దింపుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. పరశురామ్ పెట్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ లేట్ అయినప్పటికీ.. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి సినిమా రెడీ అయిపోతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2022 సంక్రాంతి సీజన్ కోసం కర్చీఫ్ వేసాడు. ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ఫెస్టివల్ కి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి సినిమా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు మరో చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం రానా దగ్గుబాటి తో కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిన్న మంగళవారం ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న '#PSPKRana' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

ఇకపోతే 2022 సంక్రాంతి సినిమాల జాబితాలోకి ''ఎఫ్ 3'' వచ్చి చేసే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా భాటియా - మెహ్రీన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.2018 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు లాస్ట్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేయగా.. కరోనా వల్ల షూటింగ్ డిలే అయింది. దీంతో ఇప్పుడు తమకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ లోనే 'ఎఫ్ 3' చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. యాక్షన్ సినిమాల మధ్యలో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అలానే తమిళ స్టార్ హీరో దలపతి విజయ్ కూడా వచ్చే సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ ''బీస్ట్'' అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2021 సంక్రాంతి కి 'మాస్టర్' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టిన విజయ్.. ఈసారి 'బీస్ట్' చిత్రాన్ని రేసులో నిలిచే అవకాశం ఉంది. మొత్తం మీద కరోనా థర్డ్ వేవ్ ప్రభావం లేకపోతే మూడు యాక్షన్ సినిమాలు - ఒక కామెడీ ఎంటర్టైనర్ తో 2022 సంక్రాంతి సీజన్ కు రసవత్తరమైన పోటీ ఖాయమని అర్థం అవుతోంది.