బాలయ్య బర్త్‌డే.. ఒక ఆశ్చర్యకర విష్

Thu Jun 10 2021 19:00:01 GMT+0530 (IST)

Former Indian Cricketer Wishes Nandamuri Balakrishna On His Birthday

ఈ రోజు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల సందడి బాగానే కనిపిస్తోంది. ఆయనకు సినీ పరిశ్రమ నుంచే కాక వివిధ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే అన్నింట్లోకి ఒక ఒక ట్విట్టర్ విష్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. బాలయ్యకు ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం విశేషం. బాలయ్యతో కలిసి ఉన్న ఒక ఫొటో పెట్టి మరీ ఆత్మీయ శుభాకాంక్షలు చెప్పాడు యువరాజ్. సినిమాలతో అందరినీ ఇలాగే అలరించడంతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని తన ట్వీట్లో అభిలషించాడు యువరాజ్. స్టార్ క్రికెటర్లకు సినిమా వాళ్లు ఇలా శుభాకాంక్షలు చెప్పడం మామూలే కానీ.. ఒక రీజనల్ యాక్టర్ గురించి ఓ పాపులర్ క్రికెటర్ ఇలా ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ నేపథ్యంలో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. యువరాజ్‌తో ట్వీట్ వేయించుకునే రేంజ్ బాలయ్యది అంటూ పొంగిపోతున్నారు. ఐతే యువరాజ్.. బాలయ్యకు విష్ చేయడంలో వేరే కనెక్షన్ ఉంది. 2011 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాక.. అతను క్యాన్సర్ బారిన పడటం ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలవడం తెలిసిందే. అప్పట్నుంచి క్యాన్సర్ మీద అవగాహన పెంచడంతో పాటు ఆ జబ్బుతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తున్నాడు యువీ. క్యాన్సర్ మీద పోరాడుతున్న సంస్థలు ఆసుపత్రులతో కలిసి అతను పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బాలయ్య ఆధ్వర్యంలో నడిచే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను కూడా ఓ సందర్భంలో సందర్శించాడు. ఈ ఆసుపత్రి ద్వారా బాలయ్య చేస్తున్న సేవ గురించి తెలుసుకుని అభినందించాడు. ఇప్పుడు బాలయ్య పుట్టిన రోజును గుర్తుంచుకుని మరీ అప్పటి ఫొటోను షేర్ చేస్తూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరిచాడు.