ఫస్ట్ లుక్: భగభగ మండే త్రిశూల ధారియైన సాయి పల్లవి

Sun May 09 2021 11:14:27 GMT+0530 (IST)

First look: Sai Pallavi wearing a glowing trident

సాంప్రదాయ చీరకట్టు.. ముక్కుకు ముక్కెర.. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు.. కణకణ మండుతున్న శూలం చేపట్టి నిప్పులు చెరుగుతున్న సాయిపల్లవి లుక్ చూస్తున్నారు కదా! ఆ చూపులోనే క్రౌర్యం కనిపిస్తోంది. ఈ బ్యూటీ ఎంపికలే వేరు. ఎంచుకున్న పాత్ర ఏదైనా అందులో జీవించేస్తుంది. ఇక అమ్మవారు పూనే భక్తురాలిగా సాయిపల్లవి రూపం వందశాతం  యాప్ట్ గా కనిపిస్తోంది.కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న `శ్యామ్ సింఘరాయ్` ఈ సంవత్సరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం లో నేచురల్ స్టార్ నాని కథానాయకుడు. రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

నేడు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సాయి పల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. సాంప్రదాయ బెంగాలీ  పట్టు చీరలో సాయి పల్లవి ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. మండుతున్న త్రిశూలాన్ని పట్టుకొని నృత్యకారిణిగా హావభావాలు పలికిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారింది. ప్రతి పాత్రను విలక్షణంగా ఆవిష్కరించే శ్యామ్ సింఘరాయ్ లో నానీ బెంగాలీ వ్యక్తిగా కనిపిస్తారు. నాని బర్త్ డే కానుకగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా  హైదరాబాద్ లో 10 ఎకరాల భూమిలో నిర్మించిన భారీ కోల్ కతా సెట్ లో శ్యామ్ సింఘా రాయ్ కీలక చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాలో నాని పాత్రతో పాటు సాయిపల్లవి పాత్ర ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయని టీమ్ చెబుతోంది.

సాయి పల్లవితో పాటు ఈ చిత్రంలో కృతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ ఇతర నాయికలుగా నటించారు. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా- రాహుల్ రవీంద్రన్- మురళి శర్మ- అభినవ్ గోమతం ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్మెంట్ సంస్థలో తొలి చిత్రమిది. సత్యదేవ్ జంగా కథ అందించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.