హీరోయిన్ తో రొమాన్స్ ను మొదలెట్టేసిన 'హీరో'

Sun Oct 24 2021 20:00:01 GMT+0530 (IST)

First Song From HERO Movie

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడు. అందుకు సంబంధించిన రంగం పూర్తయింది. మహేశ్ బాబు  మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా కాలంగా మంచి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని 'హీరో' సినిమాతో రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు చాలా రోజుల క్రితమే మొదలైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా 'అచ్చ తెలుగందమే .. 'అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్టు సింగిల్ ను రేపు వదలనున్న విషయాన్ని తెలియజేస్తూ సాంగ్ ప్రోమోను వదిలారు. గిబ్రాన్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. రొమాంటిక్ యాంగిల్ లో వదిలిన ఈ సాంగ్ పడుచు మనసులను పట్టేసేలా ఉంటుందనే విషయాన్ని ఈ ప్రోమో స్పష్టం చేస్తోంది. సినిమాలో రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయనే హింట్ ఇస్తోంది.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశోక్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాలను ఆరబోయనుంది. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ స్పీడ్ పెంచుతోంది. గ్లామర్ పరంగా ఈ సుందరికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం పవన్ సరసన 'హరి హర వీరమల్లు' కూడా చేస్తోంది. ఈ సినిమా తరువాత ఈ పిల్ల గ్రాఫ్ మారిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ జోడీగా చేస్తున్న సినిమా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాస్త ఒళ్లు చేసిన ఈ అమ్మాయి పొద్దు తిరుగుడు పువ్వులా .. ముద్దపెరుగు బువ్వలా కనిపిస్తోంది.

మొత్తానికి తెలుగు తెరకి మరో పెద్ద ఫ్యామిలీ నుంచి కుర్ర హీరో వస్తున్నాడు. ఆల్రెడీ కుర్రాడు డాన్సులతో .. ఫైట్లలో శిక్షణ  తీసుకున్నాడని అంటున్నారు. అలాగే నటనలోను పాఠాలను బాగానే వంటబట్టించుకున్నాడని చెబుతున్నారు. కాస్త కష్టపడాలేగానీ నిలదోక్కుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడున్న కుర్ర హీరోలంతా తమకంటూ ఒక స్టైల్ ను ..  ప్రత్యేకతను చాటుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ రూట్లో అశోక్ గల్లా కూడా వెళితే సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కసితో ఈ కుర్రాడు చేసిన కసరత్తు ఎంతో చూడాలి మరి.