Begin typing your search above and press return to search.

తొలిప్రేమ.. మనసులో ఎందుకలా ఫ్రెష్ గా..?

By:  Tupaki Desk   |   17 Oct 2019 1:30 AM GMT
తొలిప్రేమ.. మనసులో ఎందుకలా ఫ్రెష్ గా..?
X
మన సమాజం తెగ గ్లోరిఫై చేసిన అంశాలలో ప్రేమ ఒకటి. ఈమాట అనగానే చాలామందికి నచ్చకపోవచ్చేమో కానీ దీనికి కొంచెం వివరంగా మాట్లాడుకుంటేనే మనకు తత్త్వం బోధపడుతుంది. మనం ముందుకుగా తొలిప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకు క్లారిటీ రావాల్సిన అంశం ఒకటుంది. జీవితంలో ప్రేమ ఒక్కసారే పుడుతుందా.. లేదా ఎన్ని సార్లైనా పుడుతుందా? ఈ ప్రశ్న ఎందుకు అంటే జీవితంలో ప్రేమ ఒక్కసారి మాత్రమే పుడుతుంది అన్నారంటే.. మలిప్రేమ లేనట్టే. ఎందుకంటే మన జీవితంలో ఉన్నది సోలో ప్రేమ అయిది సెకండ్ ప్రేమకు ఛాన్స్ ఎక్కడుంది?

అలా కాకుండా మన జీవితంలో చాలాసార్లు ప్రేమ పుట్టవచ్చు అని ఒప్పుకుంటేనే 'తొలిప్రేమ' అనే పదానికి అసలు అర్థం ఉండేది! అలా కానప్పుడు దాన్ని జస్ట్ 'ప్రేమ' అనాల్సిందే. ఈ బేసిక్ పాయింట్ కు అంగీకరించకుండా జీవితంలో ఒక్కసారే ప్రేమ పుడుతుంది ఒకరిపైనే ప్రేమ పుడుతుంది అంటూనే మళ్ళీ తొలిప్రేమ అన్నారంటే తప్పనిసరిగా మీరు తప్పులో కాలేస్తున్నట్టే. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రేమకు కామానికి చాలామందికి తేడా తెలియడం లేదు.. లవ్ స్టొరీలో రొమాన్స్ ఉండవచ్చేమో కానీ రొమాన్స్ మాత్రమే ఉండేది లవ్ కాదు.

ఇక ప్రేమ నిర్వచనం ఏంటి అని అడిగితే ఒకరు అమ్మప్రేమ అంటారు.. మరొకడు నాన్న ప్రేమ అంటారు.. ఇంకొకరు జంతువులపై ప్రేమ అంటారు.. వేరొకరు సమాజంపై ప్రేమ అంటారు..ఇవన్నీ కాదు విప్లవంపై ప్రేమ అంటారు మరో మేథావి. ఇవన్నీ కూడా ప్రేమలు అయితే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ ఏంటి.. దానికి ఓ కొత్త పేరు తప్పనిసరిగా కనిపెట్టాల్సిందే. అసలు ఈ నిర్వచనాలు అన్నిటిని కలిపికొట్టి కిచిడి చేయడం వల్లే బేసిగ్గా ప్రేమ అనే పదానికి తికమక ఎక్కువైంది. ఈ ప్రేమ అనే దానికి డైరెక్ట్ గా బ్రహ్మదేవుడు వచ్చినా డెఫినిషన్ ఇవ్వలేడు. ఎందుకంటే దానికి ఇప్పటివరకూ లక్షరకాల పిచ్చ డెఫినిషన్లతో కలగాపులగం చేశారు. పెళ్ళి అనేదానికి ఒక డెఫినిషన్ ఉంది. పుట్టుక డెఫినిషన్ ఉంది. చావు డెఫినిషన్ ఉంది. ప్రేమకు డెఫినిషన్ లేదు.

ఇక ప్రేమ విషయంలో ఉన్న మరో దరిద్రం ఏంటంటే ఓడిపోయిన జంటలకు సంబంధించిన ప్రేమలు గొప్పవి అని ప్రచారం చేసి పెట్టారు. ఇంతకంటే ఏడుపుగొట్టు విషయం మరొకటి ఉండదు. ఇదెలా ఉంది అంటే నికృష్టమైన రేటింగులు తెచ్చుకుని.. కలెక్షన్స్ లేక చతికిలబడిన చెత్త సినిమాను అద్భుతం అని కీర్తించినట్టు. అన్ని చోట్ల సక్సెస్ కు విలువ ఉంటుంది.. ప్రేమలో మాత్రం ఫెయిల్యూర్ కు విలువ. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒకే రకంగా ఉన్నప్పుడు అది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రేమే. ఓడిపోతే గొప్ప ప్రేమ ఎందుకు.. గెలిస్తే నాసిరకం ప్రేమ ఎందుకు? అంటే మన జనాలకు ఏడుపులు.. పెడబొబ్బలు.. చావులు.. హత్యలు ఉంటే అది మంచి ప్రేమ అయిపోతుంది. అవేవీ లేకుండా కష్టాలను ఎదుర్కొని పోరాడి గెలిస్తే అది జఫ్ఫా ప్రేమ అవుతుందా?

సరే.. ఇవన్నీ ఒక ఎత్తైతే కొందరుంటారు.. వారు ఎప్పుడూ.. ఎనీ టైం ఎవరో ఒకరితో ప్రేమలో ఉంటారు. కాలాలు మారతాయి.. ఋతువులు.. వ్యక్తులు మారతారు కానీ వారి మనసులో ప్రేమ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా చిగురులు తొడుగుతూ ఉంటుంది. దీన్ని కూడా ప్రేమ అంటారా అని కోప్పడకండి. అలాంటి అవతారపురుషులకు/అవతారస్త్రీలకు కూడా తొలిప్రేమ ఉంటుంది. ఇంతకీ ఆ తొలిప్రేమ స్పెషాలిటీ ఏంటంటే.. మన మెదడులో హిప్పోకాంపస్‌ అనే భాగం ఉంటుందట. అద్భుతం అనిపించే కొత్త అనుభవం..ఏదైనా అది నిక్షిప్తం చేస్తుందట.

మొదటిసారి ప్రేమలో పడడం.. తొలిముద్దు లాంటివి ఎమోషనల్ థింగ్స్ అన్నీ అందులో స్టోర్ అవుతాయట. అవి ఎప్పటికీ మనసులో పదిలంగా ఉండడమే కాకుండా జస్ట్ నిన్న జరిగినట్టు మొన్న జరిగినట్టు అనిపించేలా చేస్తాయట. ఈ విషయం రీసెంట్ గా ఒక సర్వేలో వెల్లడయింది. రెండోసారికి... మూడోసారికి అన్నీ అలవాటైపోతాయి కాబట్టి వాటికి అంత సీన్ ఉండదు. అదే తొలిప్రేమ స్పెషాలిటీ.