'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్ : కరోనా అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే..!

Sat Dec 05 2020 11:15:40 GMT+0530 (IST)

First Bite of Zombie Reddy

'అ!' 'కల్కి' వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ''జాంబీ రెడ్డి''. బాలనటునిగా అలరించడంతో పాటు 'ఓ బేబీ' చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆనంది - దక్ష హీరోయిన్లుగా నటించారు. టైటిల్ అనౌన్సమెంట్ దగ్గర నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం కూడా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా 'జాంబీ రెడ్డి' మూవీ ఫస్ట్ బైట్ వీడియోను విడుదల చేశారు. దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత ఈరోజు(డిసెంబర్ 5) ఉదయం ఫస్ట్ బైట్ ను విడుదల చేసింది.''దైవం మనుష్య రూపేణా అన్నది ఇతిహాసం... రాక్షసం మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం'' అంటూ సాగిన 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్ ఈ మూవీ నేపథ్యాన్ని తెలియజేస్తోంది. ''భగవంతుని అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధా శక్తిని ఇవ్వడం. ఆ మేధా శక్తి తనకే ఒక ప్రశ్నగా నిలిస్తే దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం'' అని చెప్తూ కరోనా వైరస్ రాక గురించి చెబుతున్నారు. జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో మానవాళికి ప్రమాదకరంగా మారిన కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందులో జాంబీలను చూపించడంతో పాటు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నట్లు చూపించారు. హీరో తేజ చేతిలో గద పట్టుకొని స్టైలిష్ గా కనిపించగా.. ఆనంది త్రిసూలం మరియు దక్ష గన్ పట్టుకొని జాంబీలతో పోరాటానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. చివరగా కరోనా అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని పేర్కొన్నారు. దీనికి మార్క్ కె.రాబిన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అనిత్ అందించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

కాగా 'జాంబీ రెడ్డి' సినిమా జాంబీల కాన్సెప్ట్ తో వస్తున్న మొట్ట మొదటి తెలుగు చిత్రం. కర్నూల్ బ్యాగ్రౌండ్ లో ఈ ఫిక్షనల్ జాంబీ నేపథ్యాన్ని చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే చివరి షెడ్యూల్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. షూటింగ్ మొత్తం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స‌్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. సాయిబాబు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ 'జోంబీ రెడ్డి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.