అటు కొత్త కారు జోరు .. ఇటు కామెంట్ల హోరు!

Sat Nov 27 2021 15:04:59 GMT+0530 (IST)

Financial trouble told by Vishwa in Bigg Boss House

బిగ్ బాస్ సీజన్ 5లో జనం దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కంటెస్టెంట్ గా 'విశ్వ' కనిపిస్తాడు. మొదటి నుంచి కూడా తనదైన ఆట తీరును ప్రదర్శిస్తూ వచ్చాడు. హౌస్ లో ఎక్కువగా యాక్టివ్ గానే ఉంటూ ఫైనల్స్ వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అనుకునేలా చేశాడు.అయితే ఎలిమినేషన్స్ సమయంలో మాత్రం ఆయన చాలా వీక్ అయ్యేవాడు. అందుకు కారణం ఆర్థికపరమైన ఇబ్బందులు అని కూడా చెప్పుకున్నాడు. చివరి నిమిషంలో ఎలిమినేషన్ నుంచి బయటపడిన ఒక సందర్భంలో చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.

అంతేకాదు .. లాక్ డౌన్ సమయంలో తన కూతురుకి తాను స్కూల్ ఫీజ్ కూడా కట్టలేకపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా ఆ ఎపిసోడ్ లో విశ్వ ఎమోషన్ కి చాలామంది కనెక్ట్ అయ్యారు. అలా ఇబ్బందుల్లో ఉన్నవారికి బిగ్ బాస్ హౌస్ ద్వారా పెద్ద ఎమౌంట్ వస్తే అవసరాలకి ఉపయోగపడతాయని అనుకున్నారు.

అయితే దురదృష్టవశాత్తు తనకంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పటికీ విశ్వ బయటికి రావలసి వచ్చింది. ఇంకా కొన్ని వారాలైనా హౌస్ లో ఉంటాడనుకున్న విశ్వ హౌస్ ను వదిలిపెట్టవలసి రావడం కొంతమందిని బాధించింది.

అలా బయటికి వచ్చిన విశ్వ .. తాజాగా బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. ఖరీదైన ఆ కారు దగ్గర హుషారుగా దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ కారును డ్రైవ్ చేస్తూ ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. "నా లైఫ్ లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చింది. కలలు కన్న కారును కొనుక్కోవడంలో కలిగే ఆనందమే వేరు.

నేను ఎంతగానో ఇష్టపడిన కారును కొనుక్కుని నా కలను నిజం చేసుకున్నాను. అందుకు కారణమైన దేవుడికీ .. బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చాడు.

ఖరీదైన కారులో జాయ్ మంటూ దూసుకుపోతున్న విశ్వను చూసినవాళ్లు 'బిగ్ బాస్' కి వెళ్లి వచ్చిన తరువాత ఆయన రేంజ్ మారిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇక కొంతమంది మాత్రం .. బిగ్ బాస్ హౌస్ లో విశ్వ చెప్పిన ఆర్ధిక ఇబ్బందుల ఎపిసోడ్ ను గుర్తుచేస్తున్నారు.

కూతురికి స్కూల్ ఫీజు కట్టలేకపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్న విశ్వ బీఎండబ్ల్యూ కారును ఎలా కొన్నాడు? అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయంపై వేడి వేడి కామెంట్లను వడ్డిస్తూనే ఉన్నారు. అలాగని విశ్వ కన్నీళ్లు అబద్దమని చెప్పలేం. డబ్బు చేతికి వచ్చాక అవసరాలను కోరికలు డామినేట్ చేస్తాయనేది అందరికీ తెలిసిందే కదా!