Begin typing your search above and press return to search.

కరోనా టైంలో సినిమాలు ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్న నిర్మాతలు..?

By:  Tupaki Desk   |   28 March 2020 8:10 AM GMT
కరోనా టైంలో సినిమాలు ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్న నిర్మాతలు..?
X
ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం వల్ల ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ అయింది. షూటింగులు లేక ఖాళీగా ఉన్న సెలెబ్రెటీలు సోషల్ మీడియాను పోస్టులతో హోరెత్తిస్తున్నారు. సామాన్య ప్రజానీకం నుండి సెలెబ్రెటీల దాకా అందరికీ కాలక్షేపం కోసం సోషల్ మీడియా ఒక్కటే సాధనంగా కనిపిస్తున్నది. కరోనా నేపథ్యంలో వార్తల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ దీన్నే ఆశ్రయిస్తున్నారు. అయితే కొంతమంది సినిమా వాళ్ళు ఈ కరోనా టైం ని కూడా తమ చిత్రాల ప్రమోషన్ల కోసం వాడుకుంటున్నారు.

తమ సినిమాలు ప్రమోషన్లు చేసుకోవడంలో రాజమౌళి మాస్టర్ అని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ వల్ల భయానక పరిస్థితుల్లో కూడా రాజమౌళి తన లేటెస్ట్ సినిమా 'రౌద్రం రణం రుధిరం' ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఉగాది సందర్భంగా సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ మరియు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ చిత్ర ప్రచారాన్ని ఇంకో స్టేజ్ కి తీసుకెళ్లారు. కరోనా నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన ఎలాంటి న్యూస్ లేకపోవడంతో రాజమౌళి చిత్రానికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. అంతెందుకు మొన్న ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ రిలీజయ్యేదాకా వేరే సినిమాలకి సంబంధించిన చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.

అయితే రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకొని నిర్మాతలు తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవాలని భావిస్తున్నారట. కరోనా ఎఫెక్ట్ ఎప్పటి దాకా ఉంటుందో చెప్పలేం, ఇలాంటి నేపథ్యంలో తమ సినిమాను సినీ అభిమానుల్లో సజీవంగా ఉంచుకోడానికి కరోనాని పట్టించుకోకుండా ప్రచారం చేసుకోవడమే మార్గమని ఆలోచిస్తున్నారంట. వాస్తవానికి కరోనా నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో రిలీజ్ చేస్తేనే అందరికి రీచ్ అవుద్దని కొంతమంది నిర్మాతలు అభిప్రాయం పడుతున్నారని సమాచారం.