Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో ఏది బెస్ట్‌ ఫిలింక్ల‌బ్?

By:  Tupaki Desk   |   20 April 2019 1:30 AM GMT
హైద‌రాబాద్‌ లో ఏది బెస్ట్‌ ఫిలింక్ల‌బ్?
X
ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ ఎంద‌రో కృష్ణాన‌గ‌ర్.. యూస‌ఫ్‌ గూడ‌.. ఫిలింన‌గ‌ర్ లో ఉన్నారు. రంగుల ప్ర‌పంచంలో ఎద‌గాల‌నే త‌ప‌న‌తో హైద‌రాబాద్ లో అడుగుపెట్టే యువ‌తీయువ‌కుల్లో మెజారిటీ పార్ట్ స‌రైన అవ‌గాహ‌న లేకుండా వ‌చ్చేవాళ్లే. ఇక్క‌డ అద్దెగ‌దిలో దిగాక కానీ అస‌లు సంగ‌తి తెలీదు. ఏదీ తెలియ‌కుండానే ఇక్క‌డ అడుగుపెడ‌తారు. అస‌లు ఫిలింమేక‌ర్ కావాలంటే మినిమం బేసిక్స్ ఏంటి? ఏం చేస్తే సినిమాపై అవ‌గాహ‌న పెరుగుతుంది? ఇలాంటి సందేహాలెన్నో వెంటాడ‌తాయి. ఫిలింమేకింగ్ పై స్ట‌డీ చేసి వ‌చ్చేవాళ్లు చాలా అరుదుగానే ఉంటారిక్క‌డ‌. పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ తో పాటు హైద‌రాబాద్ లో ప‌లు ఇనిస్టిట్యూట్ ల‌లో చ‌దివిన వాళ్ల మాట అటుంచితే అస‌లేమీ తెలియ‌కుండా వ‌చ్చే వాళ్ల ప‌రిస్థితేంటి? వీళ్ల‌కు ఎవ‌రు నేర్పిస్తారు? అంటే జ‌వాబు వెతుక్కోవాలి. ఇలాంటి వారికి మినిమం విష‌యాలు తెలుసుకునేందుకు ఒక ఫిలిం క్ల‌బ్ లాంటిది ఏదైనా ఉంటే బావుంటుంద‌ని భావిస్తారు. అలాంటి వారికోస‌మే `హైద‌రాబాద్ ఫిలింక్ల‌బ్` అందుబాటులో ఉంద‌న్న సంగ‌తి తెలిసింది త‌క్కువ మందికే.

అయితే హైద‌రాబాద్ ఫిలింక్ల‌బ్ యాక్టివిటీస్ ఎక్క‌డ‌? అస‌లు హైద‌రాబాద్ ఫిలింక్ల‌బ్ లో మెంబ‌ర్ షిప్ పొంద‌డ‌మెలా? లైఫ్‌టైమ్ మెంబ‌ర్ షిప్ ఎంత‌? అన్న సందేహాలు ఉంటే అమీర్ పేట ప‌రిస‌రాల్లోని సార‌థి స్టూడియోస్ కి వెళితే స‌రిపోతుంది. ద‌శాబ్ధాలుగా ఇక్క‌డ హైదరాబాద్‌ ఫిలింక్లబ్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో మెంబ‌ర్ కావాల‌నుకుంటే సంవ‌త్స‌రానికి రూ.1200 చెల్లించాలి. క‌పుల్ కి అయితే రూ.1700 చెల్లించి స‌భ్య‌త్వం తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ టైమ్ మెంబ‌ర్ కావాల‌నుకుంటే రూ.10వేలు చెల్లించాలి.

ఇక్క‌డ నేర్చుకునేందుకు ఏం ఉంటుంది? అంటే ర‌క‌ర‌కాల విభాగాల్లో అనుభ‌వం ఉన్న ఇత‌ర మెంబ‌ర్స్ నుంచి చాలా విష‌యాలపై అవ‌గాహ‌న పొందొచ్చు. వ‌ర‌ల్డ్ సినిమా ఎలా ఉంటుంది? ఎలాంటి సినిమాలు చూడాలి? తెలుగు సినిమాల‌కు స్ఫూర్తి లేదా కాపీ ఎక్క‌డి నుంచి? ఇలా అన్ని విధాలా బోలెడ‌న్ని సంగ‌తుల‌పై అవ‌గాహ‌న క‌లుగుతుంది. హైద‌రాబాద్ ఫిలింక్ల‌బ్ సార‌థ్యంలో బోలెడ‌న్ని యాక్టివిటీస్ నిరంత‌రం జ‌రుగుతూనే ఉన్నాయి. ఇందులో వ‌ర‌ల్డ్ సినిమాకి సంబంధించిన ఫిలింఫెస్టివ‌ల్స్ జ‌రుగుతుంటాయి. ప‌లు దేశాల‌కు సంబంధించిన సినిమాల్ని రెగ్యుల‌ర్ గా ఇక్క‌డ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. సినిమా వీక్ష‌ణ‌కు ర‌క‌ర‌కాల సోర్స్ ఏంటి? అన్న‌ది కూడా ఇక్క‌డ తెలుసుకునే వీలుంది. సినిమాని చూడ‌టం.. సినిమాని స్ట‌డీ చేయ‌డం లాంటి విష‌యాల‌పైనా అవ‌గాహ‌న పెరిగే ఛాన్సుంటుంది.

ప్ర‌స్తుతం సారథి స్టూడియోస్ (డెలిగేషన్‌ ఆఫ్‌ ద యురోపియన్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో23వ యురోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతోంది. ఇక్క‌డ మూడు రోజులుగా అజర్ భైజాన్ దేశానికి చెందిన సినిమాల్ని మూడు రోజులుగా ప్ర‌ద‌ర్శించారు. ఇలాంటి ఉత్స‌వాలెన్నో నిరంత‌రం జ‌రుగుతూనే ఉంటాయి. కాబ‌ట్టి ఇక్క‌డ సినిమా మేకింగ్ పై అవ‌గాహ‌న ఉన్న‌వాళ్లు తార‌ప‌డ‌తారు కాబ‌ట్టి న‌వ‌త‌రం ఈ క్ల‌బ్ లో చేరితే ప్ర‌యోజ‌న‌క‌ర‌మే. ఫీజు కూడా బాదేయ‌కుండా అందుబాటులోనే ఉంది మ‌రి. ర‌చ‌యిత‌ల కోసం ర‌చ‌యిత‌ల సంఘం.. ద‌ర్శ‌కుల కోసం ద‌ర్శ‌క‌సంఘం.. నిర్మాత‌ల కోసం నిర్మాత‌ల మండ‌లి హైద‌రాబాద్ లో అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాగే హైద‌రాబాద్‌ ర‌వీంద్ర భార‌తిలోనూ అప్పుడ‌ప్పుడు కొన్ని ఫిలింపెస్టివ‌ల్స్ జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫెంటాస్టిక్‌ ఫైవ్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ భాగంగా కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ‌రిగింది. ఇలాంటివి ఎటెండ్ అయితే చాలా విష‌యాలపై అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. క్రియేటివిటీ ఉన్న‌వాళ్ల‌కు అంతో ఇంతో కలిసొచ్చే ప‌నే ఇది.